
'నటిని ఎంత రేటుకొస్తావని అడిగారు'
ముంబై: సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఓ వర్ధమాన నటికి సినిమా నాటకీయతను మించిన నిజజీవిత డ్రామా ఎదురైంది. ఇద్దరు వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించారు. ఎంత రేటుకు వస్తావంటూ బేరమాడారు. దీంతో ఆమె కేకలు వేయడంతో బెదిరిన దుండగులు పారిపోయే యత్నం చేశారు. వారిని ఆటోలో వెంటాడి మరీ పోలీసులకు పట్టించింది ఆ ధీరవనిత. ఈమేరకు ముంబైలో వర్ధమాన నటి పూర్ణిమా బేల్ (26)ను వేధించిన హర్యానాకు చెందిన ఇద్దరు బాక్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత గురువారం రాత్రి బాంద్రా బాండ్‌స్టాండ్‌కు జాగింగ్ కోసం పూర్ణిమా బేల్ వెళ్లింది. 10.30 గంటల సమయంలో జాగింగ్ అనంతరం ఓ బెంచ్ మీద ఆమె విశ్రాంతి తీసుకుంటూ ఫోన్‌లో తన కుటుంబసభ్యులతో మాట్లాడింది. ఈ సమయంలో ఇద్దరు బాక్సర్లు అక్కడికి వచ్చారు. వారిలో ఒకడు 'నీకేమైనా సాయం కావాలా? నీ పేరు ఏమిటి?' అంటూ ఆరాతీయడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆమె దగ్గరగా జరిగి పక్కన కూర్చున్నాడు. దీంతో ఆమె భయాందోళనకు గురైంది. 'అతను నన్నేచూస్తూ.. నాతో మాట్లాడాలని ప్రయత్నించాడు. ఈ రాత్రికి మాతో వచ్చేందుకు ఎంత తీసుకుంటావు అని అతను అడిగాడు. దీంతో నేను వెంటనే లేచి కేకలు వేశాను' అని పూర్ణిమా బేల్ వివరించారు.
'దాదాపు పది నిమిషాలపాటు నేను గట్టిగా అరిచాను. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాను. అయినా వారేం భయపడలేదు. అక్కడ జాగింగ్‌కు వచ్చిన చాలామంది కూడా ఉన్నారు. కానీ ఎవరూ నాకు సాయం చేయడానికి సాహసించలేదు. వారి మనస్తత్వం నన్ను బాధించింది. ఈ క్రమంలోనే వారు అక్కడి నుంచి ఆటోలో మెల్లగా పలాయనం చేశారు. అయినా వారిని విడిచిపెట్టవద్దని భావించి.. మరో ఆటోలో వారిని వెంబడించాను. హిల్ రోడ్డులోని సెయింట్ ఆండ్య్రూ చర్చ్ వద్ద ఉన్న పోలీసు నాకాబందీ వద్ద వారిని పోలీసులకు పట్టించాను' అని పూర్ణిమా బేల్ తెలిపారు. ముంబై పోలీసులు ఈ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులు హర్యానాకు చెందిన బాక్సర్లు దినేశ్ యాదవ్, అమిత్ కుమార్ లుగా గుర్తించారు. వీరిలో దినేశ్ యాదవ్ అరెస్టవ్వగా.. అమిత్ కుమార్ పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు.