రాజకీయ కక్షతోనే బేనీవాల్ తొలగింపు:కాంగ్రెస్
జైపూర్:మిజోరం గవర్నర్ కమలా బేనివాల్ తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. మరో రెండు నెలల్లో కమలా బేనీవాల్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆమెను తొలగించడం రాజకీయ ప్రతీకార చర్యేనని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది నిజంగా రాజ్యాంగ విరుద్ధమని రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. మాజీ కేబినెట్ మంత్రి అయిన బేనీవాల్ భారతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని అభిప్రాయపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనంతరం గవర్నర్ గా బాధ్యతులు చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమితురాలైన తొలగించడం వెనకు రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు. ఆమె ప్రజా జీవితంతో పాటు గానీ, రాజకీయ జీవితం కూడా నిష్కల్మషమైనదని ఆయన తెలిపారు. ఇంకా బేనీవాల్ మరికొన్ని నెలలు గవర్నర్ గా సేవలు చేయాల్సి ఉండగా ఆకస్మికంగా తొలగించడం నిజంగా సిగ్గుచేటని పైలట్ తెలిపారు.ఇదిలా ఉండగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఆమె తొలగింపును ఖండించారు. మరోవైపు బేనివాల్ తొలగింపులో ఎలాంటి రాజకీయాలు లేవని ఎన్డీఏ చెప్పుకొస్తోంది. బేనివాల్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించామని గురువారం పార్లమెంట్ వెలువల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు.