రద్దుపై బీజేపీ నేత దారుణమైన వ్యాఖ్యలు!
పెద్దనోట్ల రద్దుతో పాత కరెన్సీని మార్చుకోవడానికి బ్యాంకుల ఎదుట ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. బ్యాంకుల ముందు పడిగాపులు పడుతూ కొందరు ప్రాణాలు కూడా విడుస్తున్నారు. ఇలా ప్రాణాలు విడువటంపై స్పందిస్తూ ఓ బీజేపీ నాయకుడు దురుసుగా వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల ముందే కాదు అప్పుడప్పుడు రేషన్ షాపుల ముందు క్యూలో నిలబడి కూడా ప్రజలు ప్రాణాలు విడుస్తారంటూ ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ దారుణమైన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే సోమవారం విలేకరులతో మాట్లాడారు. బ్యాంకుల ముందు ప్రజలు ప్రాణాలు విడువటంపై స్పందిస్తూ.. అప్పుడప్పుడు రేషన్ షాపుల మందు కూడా ప్రజలు చనిపోతారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ప్రజల కష్టాలపై తామేమీ మొరటగా స్పందించడం లేదని ఆయన అన్నారు. భోపాల్‌లో వినోద్ పాండే (69) అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి బ్యాంకులో ముందు క్యూలో నిలుచొని ప్రాణాలు విడిచారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌లో మరో మూడు మరణాలు కూడా బ్యాంకుల్లో నగదు బదిలీకి సంబంధించి చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.