'ఆ జీహాదీ జాన్ జాడను పసిగట్టండి'
లండన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు తమ దేశ పౌరుడైన అలెన్ హెన్నింగ్‌ను బందీగా పట్టుకొని శిరచ్ఛేదం చేయడాన్ని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా పరిగణించారు. ముఖానికి ముసుగు ధరించి అలెన్‌ను శిరచ్ఛేదం చేసిన ఉగ్రవాది ‘జీహాదీ జాన్’ జాడ పసిగట్టాల్సిందిగా తమ గూఢచార సంస్థల అధిపతులను ఆదేశించారు. అతని ఉనికిని పసిగడితే అతన్ని హతమార్చేందుకు లేదా బందీగా పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను పంపుతానని దేశ ప్రధాన గూఢచార సంస్థలైన ఎంఐ5, ఎంఐ6, జీసీహెచ్‌క్యూ చీఫ్‌లతో శనివారం జరిపిన భేటీలో కామెరాన్ చెప్పారు.
ఐఎస్ ఉగ్రవాదులు మరో బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం చేసిన సంగతి తెలిసిందే. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్‌నెట్‌లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ మిలిటెంట్లు, దారుణంగా నరికి చంపారు. తవుపై దాడులకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రతీకారంగా ఆ దేశ పౌరులను ఇలా శిక్షిస్తున్నట్టు వీడియోలో పేర్కొన్నారు.