కాపీరాయుళ్లను పట్టుకోడానికి డ్రోన్లు
పిల్లలు పరీక్షల్లో కాపీ కొట్టకుండా చూడాలంటే ఏం చేస్తారు? ఇన్విజిలేటర్లతో పాటు ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ లాంటి ఏర్పాట్లు ఉంటాయి కదూ. కానీ చైనాలో మాత్రం ఏకంగా విద్యార్థుల మీద నిఘా కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. మధ్య చైనాలోని లుయాంగ్ ప్రాంతలో గల అధికారులు ఈ హైటెక్ పద్ధతిలో విద్యార్థులను పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా డ్రోన్లు ఎగురుతుంటే కొంత శబ్దం వస్తుంది. కానీ ఇలా కాపీరాయుళ్లను పసిగట్టే డ్రోన్లు మాత్రం అస్సలు చప్పుడే చేయవట. ప్రతియేటా చైనాలో దాదాపు 90 లక్షల మంది టీనేజర్లు 'గావోకావో' అనే ప్రవేశ పరీక్ష రాస్తారు.
ఎవరైనా రహస్యంగా ఇయర్ఫోన్లు పెట్టుకుని రాసినా, అత్యాధునిక పరికరాలతో హైటెక్ కాపీ కొట్టేందుకు ప్రయత్నించినా ఇవి రేడియో సిగ్నళ్ల ద్వారా ఇట్టే పట్టేస్తాయి. ఏకబిగిన ఇవి అరగంట పాటు గాల్లో ఎగురుతాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పరీక్షల్లో అక్రమార్కులను పట్టుకోవడం కష్టమైపోతోందని చైనా అధికారులు ఈ కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. విద్యార్థులు ప్రత్యేకమైన పెన్నులు తెచ్చేవాళ్లు. అవి క్వశ్చన్ పేపర్ల ఫొటోలు తీసి, బయట కావల్సిన వాళ్లకు పంపేవి. అక్కడివాళ్లు రహస్యమైన ఇయర్ఫోన్ ద్వారా సమాధానాలు అందించేవాళ్లు. ఇప్పుడు డ్రోన్ల పుణ్యమాని వాళ్ల ఆటలు సాగవు.