ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు
కోలకత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతను జుట్టు పట్టి ఈడ్చి పారేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ దుమారం రాజేశారు. పశ్చిమ్ మెద్నిపూర్ జిల్లా జార్గ్రామ్ లో ఆదివారం జరిగిన పార్టీ యువజన విభాగం సమావేశంలో మాట్లాడుతూ ఘోష్ బెనర్జీ ఇలా నోరు పారేసుకున్నారు.
పెద్దనోట్ల రద్దుతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేల కోట్ల రూపాయల నష్ట పోయారని, అందుకే ఆమెకు మతి భ్రమించిందని దిలీప్ వ్యాఖ్యానించారు. డిల్లీలో ఆమె ఆందోళన (డ్రామా) చేస్తున్నపుడు జుట్టు పట్టి లాగి విసిరి పారేసి ఉండవచ్చు.. అక్కుడన్న పోలీసులు తమ వాళ్లే...కానీ తాము అలా చేయలేదంటూ దిలీప్ చెప్పుకొచ్చారు. నోట్ల రద్దుతో పిచ్చి పట్టిన మమత ఢిల్లీ, పట్నా చుట్టూ చక్కర్లు కొడుతోందన్నారు. ఢిల్లీ, రాష్ట్ర సెక్రటేరియట్ ఆందోళనలు ఇందులో భాగమే అన్నారు. ఆమె చివరకు గంగలో దూకుతుందని తాము భావించామన్నారు. తృణమూల్ తప్పులను పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారనీ, ఇకపై మమతా దశ్చర్యలను తాము క్షమించమని ఘోష్ హెచ్చరించారు.
కాగా ఘోష్ వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. బెనర్జీ వ్యతిరేక పోరాటంలో విఫలమైన బీజీపీ ఇలాంటి వ్యక్తిగత దూషణలకు, బెదింరింపులకు పాల్పడుతోందని విమర్శించింది. ప్రమాదకరమైన బెదిరింపులు, తప్పుడు వ్యక్తిగత ప్రకటనలతో విషం చిమ్ముతూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని ఎదురు దాడి చేసింది. లక్షలాది సామాన్య జనానికి అండగా నిలిచిన మమతకు ఎదురు నిలవలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని టీఎంసీ విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించింది.