శాసనసభ, మండలిలో రెండు రోజులుగా రైతు సమస్యలపై చర్చ జరుగుతున్నా...
ప్రజల నుంచి ఛీత్కారమే..
శాసనసభ, మండలిలో రెండు రోజులుగా రైతు సమస్యలపై చర్చ జరుగుతున్నా.. ప్రతిపక్షం, విపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వడంలో తీవ్రంగా విఫలమయ్యాయి. రైతురాజ్యం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఉభయ సభల నుంచి పారిపోయారు. రైతు సమస్యలపై మంత్రి సమాధానం చెబుతుండగా.. మండలి నుంచి వెళ్లిపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్రంలో టీడీపీ నాయకులు ఏపీ సీఎంకు డబ్బా కొడుతున్నారు.. కాంగ్రెస్ నేతలకు రైతు కష్టాలు పట్టడం లేదు. చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజల నుంచి ఛీత్కారం ఎదురుకాక తప్పదు.
- కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
సిద్ధాంతాలు వీడి తిరుగుతున్నారు
మండలిలో రాద్ధాంతం చేయాలన్న ఉద్దేశంతో ప్రతిపక్ష నేతలు నిశ్చయించుకున్నారు. సిద్ధాంతాలు విడనాడి తిరుగుతున్నారు. ఎవరేమన్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి. మూడోరోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుని చర్చ జరగకుండా చేశారు. దీని వెనక రాజకీయమే.. తప్ప ప్రజా శ్రేయస్సు లేదని స్పష్టమవుతోంది.
- బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
అరచేతిలో స్వర్గం చూపిస్తున్న సర్కార్
రెండున్నర గంటలపాటు మండలిలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడినా.. అందులో స్పష్టత కనిపించలేదు. పైగా సరైన సమాధానం లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన లోపాలను కేంద్రంపై తోసేస్తోంది. దేశంలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం ముందు వరుసలో ఉంది. రైతుల కోసం ఏమేమో చేస్తున్నామని చెబుతూ... అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. రైతులారా.. ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీవెంట ప్రతిపక్షాలు ఉన్నాయి.
- రామచంద్రరావు, బీజేపీ ఎమ్మెల్సీ