
'కుర్చీ' కోసం ఢిల్లీలో కుస్తీలు
రాజకీయాల్లో పదవే పరమావధి అంటారు రాజనీతి తత్వవేత్తలు. ఇప్పుడు ఈ సూత్రం తెలంగాణ నేతలు బాగా అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో సీఎం పదవిపై కన్నేశారు. సీఎం కుర్చీ నాదంటే నాదంటూ ఢిల్లీలో చైర్ గేం ఆడుతున్నారు. తెలంగాణ నేతల పవర్ గేం ఇప్పుడు ఢిల్లీలో కుస్తీలు పట్టిస్తుంది అంటున్నారు హస్తిన రాజకీయాలు బాగా తెలిసిన వాళ్లు.
తెలంగాణ ప్రజలు సంబరాల్లో మునిగిపోతే మరోవైపు తెలంగాణ నేతలు సీఎం కుర్చీ గేమ్‌లో మునిగిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సీఎం దళితుడే కావాలనే నినాదంతో దామోదర రాజనరసింహ ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. మూడు నెలలగా ఈయన ఢిల్లీలోనే మకాం వేసి సీఎం సీటు కోసం అధిష్టానం పెద్దల గడపలన్నీ తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో దామోదర అందుబాటులో ఉండాలని అధిష్టానం నుంచి కూడా పిలుపు వచ్చిన నేపథ్యంలో సీఎం రేసులో ఆయన ముందున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు దామోదర రాజనర్సింహ జిల్లాకే చెందిన మరో కాంగ్రెస్ నేత గీతారెడ్డి రెడ్డి నేనేం తక్కువ కాదంటూ సీఎం రేస్లో దూసుకెళ్తున్నారు. తనను రాజకీయాల్లో కి తీసుకొచ్చిన గాంధీ కుటుంబాన్నే నమ్ముకుని పావులు కదుపుతున్నారని మెదక్ జిల్లా వాసులు అనుకుంటున్నారు. ఇక..తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ కూడా అసలు మీరేంటీ..నేను సీఎం కావాలి అన్నట్లు ఢిల్లీలో వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారని తెలంగాణ వాదులు అంటున్నారు.
ఈ ముగ్గురు మెదక్ జిల్లా వాసులే కావడం గమనార్హం. వీరితోపాటు రేసులో లేనప్పటికీ సునీతా లక్ష్మారెడ్డి..హోం మంత్రి కోసం తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారట!. తాను సీఎంను అయితే...మీకు హోం మంత్రి ఇస్తానని గీతమ్మ..సునీతమ్మకు మాట ఇచ్చారట!. అయితే సీఎం, హోం రెండూ మెదక్ జిల్లాకి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంటుందా అంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు తెలంగాణ వాదులు.
ఇక ఇప్పటి దాకా కిరణ్ వర్గంలో ఉన్నా జగ్గారెడ్డి తెలివిగా పావులు కదుపుతున్నారట!. తనకు మంత్రి పదవి ఎవరిస్తే వారితోనే అంటూ సిగ్నల్స్ పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే ముత్యం రెడ్డిలు కూడా ఇదే డిమాండ్‌తో ఉన్నట్లు సమాచారం.