ఢిల్లీ న్యాయశాఖ మంత్రి తోమర్ అరెస్టు | delhi law minister jitendra singh tomar arrested | Sakshi
Sakshi News home page

ఢిల్లీ న్యాయశాఖ మంత్రి తోమర్ అరెస్టు

Published Wed, Jun 10 2015 4:04 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

ఢిల్లీ న్యాయశాఖ మంత్రి తోమర్ అరెస్టు

ఢిల్లీ న్యాయశాఖ మంత్రి తోమర్ అరెస్టు

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ ఆరోపణలపై మంత్రిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
- 4 రోజుల పోలీసు కస్టడీకి తోమర్.. మంత్రి పదవికి రాజీనామా
- కేంద్రం అత్యవసర పరిస్థితి వాతావరణాన్ని సృష్టిస్తోంది: ఆప్

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆధిపత్యంపై కేంద్రానికీ, కేజ్రీవాల్ సర్కార్‌కీ మధ్య యుద్ధం పతాకస్థాయికి చేరుకుంటోంది. కేజ్రీవాల్‌ను చిక్కుల్లోకి నెట్టడానికి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవటం లేదు.

తాజాగా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారంలో కేజ్రీవాల్ కేబినెట్ మంత్రిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయటంతో వివాదం ముదిరింది. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్‌సింగ్ తోమర్ బిహార్‌లోని ముంగేర్ కాలేజీ నుంచి నకిలీ సర్టిఫికెట్ సంపాదించారని ఢిల్లీ బార్‌కౌన్సిల్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఆయన్ను మంగళవారం ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేశారు. సోమవారం ఢిల్లీలోని హాజ్‌కాజ్ పోలీస్ స్టేషన్‌లో తోమర్‌పై మోసం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదయ్యాయి.  మంగళవారం 40 మంది పోలీసులు  తోమర్‌ను ఆయన ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు.

ఒక మంత్రిని అరెస్టు చేయటానికి కావలసిన అన్ని నియమాలనూ పాటించామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. తోమర్‌పై తమకు చాలా కాలం క్రితమే ఫిర్యాదు అందిందనీ, నిశిత దర్యాప్తు చేసిన తరువాతే.. చట్టపరిధిలోనే మంత్రిని అరెస్టు చేశామని బస్సీ వివరించారు. తోమర్‌ను అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్  ముందు హాజరు పరిచారు.

నకిలీ సర్టిఫికెట్ కేసు విచారణలో భాగంగా తోమర్‌ను యూపీ ఫైజాబాద్, బిహార్‌లోని భాగల్‌పూర్‌కు తీసుకువెళ్లాల్సి ఉన్నందున 5 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరారు. అయితే మేజిస్ట్రేట్ 4 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చారు. అరెస్టు నేపథ్యంలో మంత్రి పదవికి తోమర్ రాజీ నామా చేయగా కేజ్రీవాల్ ఆమోదించారు. తోమర్‌ను అరెస్టు చేయాలని తన శాఖ ఢిల్లీ పోలీసులకు ఆదేశాలివ్వలేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు.
 
ఎమర్జెన్సీ సృష్టిస్తున్నారు: ఈ ఘటనపై ఆప్ సర్కారు తీవ్రంగా మండిపడింది. తమ మంత్రిని అరెస్టు చేయడానికి కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో కుట్ర జరిగిందని పేర్కొంది. మోదీ సర్కారు ఢిల్లీలో అత్యవసరపరిస్థితి వాతావరణాన్ని సృష్టిస్తోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. తోమర్‌ను పోలీసులు ఓ మాఫియాలాగా భావిస్తున్నారన్నారు.

దీని వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే మోదీ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్ చేత దుర్మార్గపు పనులు చేయిస్తున్నారని ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌భారతి ఆరోపించారు. కేవలం 12వ తరగతి పాసై డిగ్రీ పాసైనట్లు చెప్పుకున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీని ఎన్డీఏ సర్కారు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
 
ఏసీబీ చీఫ్‌కు నో ఎంట్రీ
మరోపక్క..ఢిల్లీ ఏసీబీ చీఫ్‌గా ఎల్జీ నియమించిన ఎంకే మీనా నియామకం వివాదాస్పదమైంది. మీనాకు బాధ్యతలు అప్పగించబోమని ఆప్ సర్కార్ మంగళవారం లేఖ పంపింది. మీనా జాయింట్ కమిషనర్ హాదా అధికారి అని, ఏసీబీలో ఉన్న అలాంటి ఒక పోస్టు ఖాళీగా లేనందువల్ల వెనక్కి వెళ్లాలంది. అయితే గవర్నర్ ఆదేశాల ప్రకారం మంగళవారమే బాధ్యతలు చేపట్టానని మీనా చెప్పారు. మీనా నియామకపు ఉత్తర్వులు ఇచ్చిన ఢిల్లీ హోం కార్యదర్శి ధరమ్ పాల్‌ను ప్రభుత్వం  బదిలీ చేసింది. అయితే బదిలీ చెల్లదని ఎల్జీ వెంటనే ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement