కళకళలాడుతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ షేర్లు
ముంబై: రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా మార్కెట్ లో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలకు చెందిన షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మదుపర్ల కొనుగోళ్లతో ఈ పలు కంపెనీల షేర్లు ధగధగ లాడుతున్నాయి. పండుగ ఉత్సాహంతో నెలకొన్న బైయింగ్ సపోర్ట్ తో దాదాపు అన్ని జెమ్స్ అండ్ జ్యుయలరీ స్టాక్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. ముఖ్యంగా గోల్డియం ఇంటర్నేషన్ లిమిటెడ్ 15శాతం, తారా జ్యుయలరీ 9శాతం, గీతాంజలి జెమ్స్ 11 శాతం, పీసీ జ్యుయలరీ 6 శాతం, త్రిభువన్ దాస్ భీమ్ జీ జవేరీ లిమిటెడ్ 5 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే టైటాన్ కో లిమిటెడ్ , రాజేష్ లిమిటెడ్ కూడా లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో స్పెక్యులేటర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారని ఎనలిస్టుల అంచనా.
అటు బులియన్ మార్కెట్లో గత కొన్ని సెషన్లు గా నీరసంగా ఉన్న పసిడి ధరలు కూడా పుంజుకున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో ఉదయం నుంచీ జోరుమీదున్న పుత్తడి200 రూపాయల లాభంతో 29,780 వద్ద ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రా. బంగారం ధరలు Gold 193రూపాయలు ఎగిసి రూ. 29,850 వద్ద ఉంది. ఇది ఇలా ఉండగా స్టాక్ మార్కెట్లు స్వల్పలాభనష్టాల మధ్య ఊగిసలాడుతో స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.