చైనాలో దుబారా చేస్తే అంతే..
ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యయ నియంత్రణ పాటించకుండా, దుబారా ఖర్చులు చేస్తూ జాతి సంపదను హరించి వేస్తున్న సర్కారు ఉద్యోగులపై చైనా ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. శనివారం ఒక్కరోజే ఏకంగా 22 వేల మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మితిమీరిన ఉద్యోగస్వామ్యాన్ని అదుపు చేయాలని నిబంధనలను రూపొందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇందుకోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.
కానీ, లక్షల మంది ఉద్యోగులు ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దీంతో 2012 నుంచి ఇప్పటి వరకు నిబంధనలను ఉల్లంఘించిన 1.20 లక్షల మంది ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వంలోని కిందిస్థాయి సిబ్బందితో పాటు అత్యున్నత స్థాయి అధికారులు కూడా క్రమశిక్షణ చర్యలకు గురైన వారిలో ఉన్నారు.
16,761 కేసుల్లో ప్రమేయం ఉన్న వీరందరిపై చర్యలు చేపట్టినట్లు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన కేంద్ర క్రమశిక్షణ, విచారణ కమిషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, 2014లో ఇలా క్రమశిక్షణ చర్యలకు గురైన అధికారులు 71 వేల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాహనాలను వ్యక్తిగత పనులకు వాడటం, అనర్హులకు సబ్సిడీలు ఇవ్వడం, విందులు, వినోదాలకు విపరీతంగా ఖర్చులు చేయడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.