హరీశ్ సభను తప్పుదోవ పట్టించారు
సాక్షి, హైదరాబాద్: సభానిర్వహణకు అడ్డుపడకపోయినా, కనీసం కుర్చీ నుంచి నిలబడకపోయినా శాసనసభ నుంచి తనను ఒకరోజు సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. శనివారం శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్పీకర్ వెల్‌లోకి తాను వెళ్లలేదని, సభలో మాట్లాడుతున్న ఏ సభ్యుడినీ తాను అడ్డుకోలేదని అన్నారు.
వెల్‌లోకి వెళ్లాలని, సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని ఇతర సభ్యులను తాను ప్రోత్సహించినట్టుగా శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడటం సరికాదని భట్టి అన్నారు. సభను తప్పుదోవ పట్టించేవిధంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారని ఆరోపించారు. శాసనసభలో వీడియో ఫుటేజీని సభాపతి ముందు పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు. తాను తప్పుచేసినట్టుగా తేలితే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. స్పీకర్ ముందు వీడియో ఫుటేజీని పెట్టకుంటే, అబద్ధాలు మాట్లాడిన మంత్రి హరీశ్‌రావుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని భట్టి హెచ్చరించారు.