
ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా. చిత్రంలో మంత్రులు గడ్కరీ, సుష్మా, రాజ్
- ఇది మోదీ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం అనటం సరికాదు: జైట్లీ
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల సందర్భంగా పలువురు నేతలు చేసిన బాధ్యతారహిత ప్రకటనలు.. ఎన్నికల క్రమాన్ని మార్చేశాయని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అంగీకరించారు. ఎన్‌డీఏ ఓటమికి.. ప్రత్యర్థులు ఏకం కావటం, వారి ఓట్లు పరస్పరం బదిలీ కావటమే కారణమని అభిప్రాయపడ్డారు. ఈ ఓటమికి ఏ ఒక్కరూ బాధ్యులు కాదంటూ.. పార్టీ సంయుక్తంగా గెలుస్తుందని, సంయుక్తంగా ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమన్న విమర్శలను ఆయన తిరస్కరించారు.
ఆదివారం వెల్లడైన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ దారుణ పరాజయం చవిచూసిన నేపథ్యంలో.. ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ప్రధానమంత్రి మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలు కూడా పాల్గొన్న ఈ భేటీలో.. బిహార్‌లో ఓటమికి గల కారణాలపై సమీక్షించారు. దానికన్నా ముందుగా.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్‌భగవత్‌ను కలిశారు. బిహార్ ఎన్నికల ఫలితాలు, ఇతర అంశాలపై చర్చిం చినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ప్రభావమెంతో తెలియదు
ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కొన్ని బాధ్యతారహిత ప్రకటనలు నిజంగానే పరిస్థితిని మార్చివేశాయి. పార్టీ నేతలు ప్రతి ఒక్కరూ మర్యాదగా మాట్లాడాలి. పరిస్థితి మళ్లీ పట్టాలెక్కించేందుకు నేను పదే పదే జోక్యం చేసుకున్నా. అయితే.. ప్రణాళికకు సంబంధించినంత వరకూ ఇవి చెదురుమదురు కారణాలే. అవి బిహార్‌పై ఎంత మేర ప్రభావం చూపాయనేది నాకు తెలియదు. దాద్రీలో బీఫ్ తిన్నాడన్న నెపంతో వ్యక్తిని కొట్టి చంపటం, కర్ణాటకలో హేతువాది ఎం.ఎం.కల్బుర్గిని హత్య చేయటం వంటి ఘటనలు చెదురుమదురుగా సంభవించే అరుదైన ఘటనలు.. దేశవ్యాప్తంగా ఉండే సరళి కాదు. ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారికి.. ఊరకే నోరు జారి మాట్లాడే వారికి మధ్య తేడా చూడాలి.
ఓట్ల శాతంలో పెద్ద మార్పు లేదు...
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ 38.8 శాతం ఓట్లు సంపాదించింది. ఆ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన మహాకూటమిలోని మూడు పార్టీలూ కలిపి 45.3 శాతం ఓట్లు పొందాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏకి 34.1 శాతం ఓట్లు, మహాకూటమికి 41.9 శాతం ఓట్లు వచ్చాయి. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా అటూ ఇటూగా అంతే ఉంది. మామూలుగా కూటమి ఏర్పడినపుడు.. భాగస్వామ్య పక్షాలన్నీ తమ భాగం ఓట్లు మొత్తాన్నీ పరస్పరం పంచుకోవటం సాధ్యం కాదన్న అభిప్రాయం ఉంది.
అవి కూడా (ఆర్‌జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లు) అలా చేయలేవని మేం భావించాం. మా అంచనా పొరపాటయింది. వారి ఓట్ల బదిలీ చాలా బాగుంది. వారి సామాజిక సమీకరణాల పరిమాణం.. మా దానికన్నా పెద్దదయింది. ఎన్నికల ప్రచార సారథి ప్రధానమంత్రే అయినందున.. బిహార్ ఫలితాలను కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయంగా చూడాలనడం సరికాదు. ఒక రాష్ట్ర ఎన్నికలు కేంద్రంపై ప్రజాభిప్రాయం కాబోవు. అన్ని ఎన్నికలూ విభిన్న అంశాలపై జరుగుతుంటాయి. బిహార్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవటానికి మాకు సరైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. బీజేపీ మిత్రపక్షాలైన మూడు పార్టీలు పోటీ చేసిన 84 సీట్లలో కేవలం ఐదు సీట్లనే గెలుచుకున్నప్పటికీ.. అది పెద్ద విషయం కాదు. ఆ పార్టీలు తమ ఓట్లను బీజేపీకి బదలాయించగలిగాయి.
గెలుపు, ఓటములు ఆటలో భాగం
‘‘బిహార్‌లో ఓటమికి బాధ్యత అంటే.. పార్టీ ఉమ్మడిగా గెలుస్తుంది.. ఉమ్మడిగా ఓడిపోతుంది. గెలవటం, ఓడటం అనేవి ఆటలో భాగం. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత అమిత్‌షా అధ్యక్షతన బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. పలు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలిచింది. కులాల ప్రాతిపదికగా ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్‌భగవత్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేశాయన్న వాదనను మేం అంగీకరించబోం. బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్‌లో టపాసులు కాలుస్తారంటూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీకి చేటు చేశాయనటం సరికాదు.. ఒకే ఒక్క వ్యాఖ్య ఎన్నికల ఫలితాలను నిర్ణయించజాలదు.