బాస్ వేధిస్తున్నారు: మహిళా ఐపీఎస్ | IPS officer alleges harassment by senior | Sakshi
Sakshi News home page

బాస్ వేధిస్తున్నారు: మహిళా ఐపీఎస్

Published Tue, Sep 29 2015 4:07 PM | Last Updated on Thu, Sep 27 2018 2:31 PM

పైస్థాయి అధికారి తనను వేధిస్తున్నారంటూ గుర్గావ్ జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ భారతీ అరోరా ఆరోపించారు.

గుర్గావ్: పైస్థాయి అధికారి తనను వేధిస్తున్నారంటూ గుర్గావ్ జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ భారతీ అరోరా ఆరోపించారు. ఓ అత్యాచార కేసు విచారణకు సంబంధించి పోలీస్ కమిషనర్ నవదీప్ సింగ్ తనను వేధిస్తున్నారని, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, అనవసర జోక్యం చేసుకుంటున్నారని అరోరా చెప్పారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు హర్యానా డీజీపీ యశ్పాల్ సింఘాల్కు లేఖ రాసినట్టు చెప్పారు.

రేప్ కేసులో సీనియర్ పోలీస్ అధికారి కొడుకు అజయ్ భరద్వాజ్ నిందితుడిగా ఉన్నాడు. అయితే  పోలీస్ కమిషనర్ ఉద్దేశ్యపూర్వకంగా అజయ్ కుటుంబాన్ని ఈ కేసులో చేర్చారని అరోరా ఆరోపించారు. తాను ఈ కేసు దర్యాప్తు ప్రారంభించగానే ఈ విషయం తెలుసుకున్నానని, అభ్యంతరం తెలియజేశానని చెప్పారు. అప్పటి నుంచి నవదీప్ సింగ్ తనను వేధిస్తూ, బెదిరిస్తున్నారని ఆరోపించారు. నవదీప్ సింగ్ వల్ల తన కెరీర్కు ప్రమాదం ఉందని డీజీపీ రాసిన లేఖలో అరోరా పేర్కొన్నారు.

అయితే అరోరా ఆరోపణలను నవదీప్ సింగ్ ఖండించారు. రేప్ కేసులో నిందితుడి సోదరి అరోరాకు తెలుసని, అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని డీజీపీకి పంపిన నివేదికలో పేర్కొన్నారు. గుర్గావ్ మాజీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్ పీ భరద్వాజ్ కొడుకయిన అజయ్ను గతేడాడి అత్యాచారం కేసులో అరెస్ట్ చేశారు. అజయ్ మాజీ జీవిత భాగస్వామి ఫిర్యాదు మేరకు అతని కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement