ఐటీ రంగానికి వీసా షాక్!
ముంబై: ముస్లిం దేశాలనుంచి వలసలను నివారించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నకఠిన నిర్ణయాల నేపథ్యంలో ఐటీ షేర్లు డీలా పడ్డాయి. సుమారు ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను అరికట్టేందుకు వీసాలపై ఆంక్షలు విధించడంతో ఐటీ షేర్లు నష్టాలనెదుర్కొంటున్నాయి. మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడ్డంతో ఐటీ సెక్టార్ లో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించింది. ఐటీ బ్లూచిప్స్ షేర్లు ఇన్ఫోసిస్ 0.77 శాతం, టీసీఎస్ 1శాతం, విప్రో 1.65 శాతం నష్టపోతున్నాయి. ఇదే బాటలో హెచ్‌సీఎల్ టెక్ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.
అటు బుధవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలైనా. వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా ఊగిసలాటల మధ్య కొనసాగుతున్నాయి. బడ్జెట్ అంచనాలతో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
మరోవైపు ట్రంప్ ఎఫెక్ట్‌తో పసిడి ధరలు మళ్ళీ ధగధగ లాడుతున్నాయి. గత వారం రెండు వారాల కనిష్టానికి చేరిన పసిడికి డిమాండ్ బాగా పుంజుకుంది. ఏడు ముస్లిం దేశాల ప్రయాణికులకు వీసాలను నిషేధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు తెరలేవగా... సంక్షోభ పరిస్థితుల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడిలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.