సోనియాతో కేసీఆర్ భేటీ
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడం.. మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. సోమవారం రాత్రి కేసీఆర్ సోనియా నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. అయితే సోనియాతో భేటీకి ముఖ్యనేతలను కేసీఆర్ తీసుకెళ్లకుండా, తన కుటుంబ సభ్యులకే పరిమితం చేయడంపై పలు విమర్శలకు తావిస్తోంది. ఈ సమావేశంలో కేసీఆర్ కొడుకు కేటీఆర్, బంధువు సంతోష్, సన్నిహితుడు వినోద్ లు పాల్గొన్నట్టు తెలిసింది. పొత్తు, విలీనం పైనే సోనియాతో కేసీఆర్ చర్చించనున్నారు. దీనిపై మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
కాగా, తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేతలు విలీనం అంశంపై కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో సోనియాతో కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.