
కెన్యాలో నరమేధం
నైరోబీ/అబూజా: కెన్యాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. దేశ రాజధాని నైరోబీలోని ఓ షాపింగ్‌మాల్‌లో మారణకాండ సృష్టించారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు మాల్‌లోని సిబ్బందిని, ప్రజలను బందీలుగా పట్టుకుని, విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణంలో ఇద్దరు భారతీయులు సహా మొత్తం 59 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు వెయ్యి మందిని మాల్ నుంచి సురక్షితంగా కాపాడినా చాలామంది ఇంకా ముష్కరుల చేతిలో బందీలుగా ఉన్నారు. కచ్చితంగా ఎంత మంది బందీలుగా ఉన్నారన్న విషయాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. ఉగ్రవాదుల సంఖ్యపైనా అయోమయం నెలకొంది. భారీ ఎత్తున ఆయుధాలు ధరించిన 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని కెన్యా అంతర్గత భద్రత మంత్రి జోసెఫ్ ఒలే లెంకూ చెప్పారు. ముష్కరుల దాడిలో మరణించిన విదేశీయుల్లో ఇద్దరు భారతీయులు, ఇద్దరు కెనడా పౌరులు, ఇద్దరు ఫ్రాన్స్ జాతీయులు, ఒక దక్షిణ కొరియా పౌరుడు ఉన్నారు.
సోమాలియాలో సైనిక చర్యకు ప్రతీకారంగా..
శనివారం మధ్యాహ్నం నైరోబీలోని వెస్ట్‌గేట్ షాపింగ్ మాల్‌పై ఈ దాడి జరిగింది. దాడి సమయంలో వేలమంది భవనంలో ఉన్నారు. ఈ మాల్ యజమాని ఇజ్రాయిల్‌కు చెందినవారు. సోమాలియాకు చెందిన అల్‌కాయిదా అనుబంధ ‘అల్ షెబాబ్’ సంస్థ ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. సోమాలియాలో దక్షిణ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాదుల అణచివేతలో కెన్యా సైన్యం పాలుపంచుకుంటోంది. 2011 నుంచి ఆఫ్రికన్ యూనియన్ బలగాలతో కలిసి దాదాపు 4 వేల మంది కెన్యా సైనికులు సోమాలియాలో ముష్కర మూకలతో పోరాటం చేస్తున్నారు. ఇందుకు ప్రతీకారంగానే తాము వెస్ట్‌గేట్ షాపింగ్ మాల్‌పై దాడి చేశామని ‘అల్ షెబాబ్’ సంస్థ ప్రకటించుకుంది. ముఖాలకు మాస్కులు, పెద్ద ఎత్తున ఆయుధాలతో మాల్‌లోకి ప్రవేశించిన వెంటనే విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. పౌరులు బందీలుగా ఉండటంతో సైనికులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, ఇప్పటిదాకా ఉగ్రవాదులు 59 మందిని పొట్టనబెట్టుకున్నారని మంత్రి జోసెఫ్ వెల్లడించారు. మృతుల్లో ఘనాకు చెందిన ప్రముఖ కవి, రాజకీయవేత్త కోఫీ అవూనుర్ కూడా ఉన్నారు. ఈయన ఘనా మాజీ అధ్యక్షుడు జాన్ అట్టా మిల్స్‌కు గతంలో సలహాదారుగా వ్యవహరించారు.
మృతుల్లో తమిళనాడు వాసి...
కాల్పుల్లో మరణించిన ఇద్దరు భారతీయుల్లో ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నాడని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల్లో స్థానిక హార్లేస్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న తమిళనాడువాసి శ్రీధర్ నటరాజన్(40), కెన్యాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచి మేనేజర్ మనోజ్ జైన్ తనయుడు పరామ్‌శు జైన్ (8) ఉన్నట్లు పేర్కొంది. నటరాజన్ భార్య మంజుల, పరామ్‌శు జైన్ తల్లి ముక్తా జైన్, ఆమె కూతురు పూర్వి జైన్‌లతోపాటు ఫ్లెమింగో డ్యూటీ ఫ్రీ కంపెనీలో పనిచేస్తున్న నటరాజన్ రామచంద్రన్‌లు గాయాలపాలయ్యారు. కెన్యాలో భారతీయులు/భారత సంతతికి చెందినవారు సుమారు 70 వేల మంది ఉన్నారు. ఈ దాడిని ప్రధాని మన్మోహన్ ఖండించారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టకు లేఖ రాశారు.