కేవీపీ, ఎంఏఖాన్, కొప్పులకు చోటు!
న్యూఢిల్లీ : రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక కావాల్సిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు ఖరారు చేసినట్లు సమాచారం. ఈసారి మూడు సీట్లకే కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించింది. రాజ్యసభ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థులుగా కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, కొప్పుల రాజులను ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపినకు ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న నేతలను కాంగ్రెస్ బుజ్జగించే పనిలో పడింది. కాగా ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఇక రాజ్యసభ టికెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ కాంగ్రెస్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు పార్టీ ఎంపిక చేసే అభ్యర్థులను ఓడిస్తామని చెబుతుండటం, సమైక్యవాదాన్ని విన్పిస్తున్న నేతలను స్వతంత్రులుగా బరిలో దింపేందుకు ప్రయత్నిస్తుండటంతో అధిష్టానం పెద్దలకు అభ్యర్థుల ఎంపిక చిక్కుముడిగా మారింది. ఇలాంటప్పుడు కొత్తవారిని ఎంపిక చేయడం లేనిపోని ఇబ్బందులకు దారి తీయొచ్చన్న ఆందోళన కూడా నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగులనే మళ్లీ బరిలో దించితేనే మేలన్న ఆలోచన అధిష్టానం ఉంది.