సారీ... బరువెక్కువైతే ఆస్పత్రిలో చేర్చుకోం! | LNJP and GB Pant hospitals refuse to do surgery | Sakshi
Sakshi News home page

సారీ... బరువెక్కువైతే ఆస్పత్రిలో చేర్చుకోం!

Published Thu, Oct 8 2015 4:50 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

సారీ... బరువెక్కువైతే ఆస్పత్రిలో చేర్చుకోం!

సారీ... బరువెక్కువైతే ఆస్పత్రిలో చేర్చుకోం!

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ఎందుకు పాడుకుంటారో ఢిల్లీ వాసులకు ఇప్పుడు తెలుస్తోంది. ఢిల్లీలోని సర్కారు దవాఖానాల్లో ప్రసిద్ధ లోక్నాయక్ జయప్రకాష్, జీబీ పంత్ ఆస్పత్రులు తీసుకున్న ఓ నిర్ణయం రోగులనే కాదు..  దేశ ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఆస్పత్రుల్లో డాక్టర్లు... ఊబకాయులకు సారీ చెప్పేస్తున్నారు. 80 కేజీల కంటే ఎక్కువ బరువున్న పేషెంట్లకు సర్జరీలు చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ బరువుకు... ఆస్పత్రిలో చేర్చుకోపోవడానికి లింకేంటో అనుకుంటున్నారా?

ఆయా ఆస్పత్రుల్లోని ఆపరేషన్ టేబుల్స్ మరీ పాతవైపోవడమే అందుకు కారణమట.. ఇటీవల ఆస్పత్రిలో ఓ రోగికి ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి టేబుల్ ఊగిందట. వైద్యులు అప్రమత్తమయ్యేలోపే టేబుల్ విరిగిపోయి... మత్తులో ఉన్న రోగి నేలపై పడిపోయాడట. ఎలాగో శస్త్రచికిత్స పూర్తయి రోగి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ఎపిసోడ్తో మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ జిబి పంత్ ఆస్పత్రి వైద్యులు షాకయ్యారు.

ఇక ఊబకాయులకు చికిత్స చేయడం ప్రమాదమేనని నిర్ణయించుకొన్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల్లోని సర్జరీ డిపార్ట్ మెంట్లు అన్నీ కలసి ఓ ఉత్తర్వును జారీ చేశాయి. 80 కేజీలకు పైబడి బరువున్న వారిని ఆస్పత్రిలో చేర్చుకొనేందుకు తిరస్కరించాలని నిర్ణయించారు. 2012 లో ఎల్ఎన్జెపి ఆస్పత్రి బేరియాట్రిక్ శస్త్రచికిత్స విభాగాన్ని ప్రారరంభించింది. అప్పటినుంచి వైవిధ్య సేవలు అందించడంలో దేశంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ విభాగం.. లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను అందించడంలో ఎంతో పేరు గడించింది. ఒక్క రోజులోనే 100కు పైగా ఆపరేషన్లు ఇక్కడ నిర్వహిస్తుంటారు.  

అయితే ఆపరేషన్ టేబుల్స్ కొనుగోలుకు ఆమోదం లేకపోవడం, నిర్వహణా లోపం కూడా ప్రస్తుత దుస్థితికి కారణమైంది. ఇప్పుడు రోగి భద్రతే ధ్యేయంగా మేం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం అంటున్నారు సర్జరీ విభాగం హెడ్,  ప్రొఫెసర్ డాక్టర్ సంజీవ్ కుమార్ తుడు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉంటాయని,  ప్రభుత్వాసుపత్రుల్లో కూడా అలాంటివి అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ తుడు తెలిపారు.  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం భారతదేశంలోని దాదాపు 13 శాతం మంది ప్రజలు స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement