జూన్ 12 టూ సెప్టెంబర్ 10
మేకింగ్ ఆఫ్ మహాగణపతి
91 రోజుల ప్రతిమ ప్రస్థానం
ఖైరతాబాద్: ఎన్నో ఆలోచనలు.. మరెన్నో అంచనాలు.. సిద్ధహస్తులైన శిల్పులు.. చేయి తిరిగిన కళాకారులు.. వెరసి 59 అడుగుల భారీ గణపయ్య విగ్రహం. అదే ఖైరతాబాద్ మహా గణపతి. భక్తుల కంటికి ఇంపైన రూపం. ఈ ఏడాది త్రిశక్తిమయ మోక్ష గణపతి స్వరూపం. భక్తుల అంచనాలకు అనుగుణంగా ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఊహకు రూపమిచ్చారు. జూన్ 12న భూమి పూజతో మొదలై సెప్టెంబర్ 10 నాటికి నేత్రాలను దిద్దే స్థాయికి చేరుకుంది ఈ ప్రతిమ ప్రస్థానం. 91రోజుల పాటు ఎలా సాగిందో వివరించే స‘చిత్ర’ కథనం..
జూన్ 12: భూమిపూజ
ఆ రోజు నుంచే ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రధాన శిల్పి రాజేంద్రన్‌తో ఈ ఏడాది రూపంపై కసరత్తు ప్రారంభించారు. ఎన్నో సలహాలు, మార్పులతో గణపయ్య రూపు తయారీ మొదలైంది. కంప్యూటర్ డిజైనర్ ప్రవీణ్ సహకారంతో శిల్పి రాజేంద్రన్ రెండు రోజుల పాటు శ్రమించి తుదిరూపును తయారు చేశారు. ‘త్రిశక్తిమయమోక్ష గణపతి’గా నామకరణం చేశారు.
జూలై 2: నమూనా ఆవిష్కరణ
ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్ అండ్ టీం (15 మంది) షెడ్డును నిర్మించారు. 22 టన్నుల సర్వే కర్రలు, 50 బండిళ్ల తాళ్లు వినియోగించారు.
జూలై 15: వెల్డింగ్ పనులు షురూ
కావలికి చెందిన శేషారెడ్డి బృందం (10 మంది) వెల్డింగ్ పనుల్ని ప్రారంభించింది. 20 టన్నుల స్టీల్‌ను వినియోగించారు.
జూలై 28: 4 టన్నుల బరువైన 42 అడుగుల ఎత్తయిన సెంటర్ పోల్‌ను క్రేన్ సాయంతో అమర్చారు.
ఆగస్ట్ 7: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు..
చెన్నైకి చెందిన మూర్తి టీం(25 మంది), మహారాష్ట్ర సుభాష్ టీం పీఓపీ పనుల్ని ప్రారంభించాయి. ఇందుకు 34 టన్నుల పీఓపీ, 75 బండిళ్ల కొబ్బరి నార, బంకమట్టి 600 బ్యాగులు, ఫెవికాల్ 30 లీటర్లు, సబ్బులు 50, నూనె 40 లీటర్లు వినియోగించారు.
సెప్టెంబర్ 2: పెయింటింగ్ పనులు ప్రారంభం
కాకినాడకు చెందిన భీమేష్ టీం (20 మంది) విగ్రహానికి రంగులద్దే పనులకు శ్రీకారం చుట్టింది. 200 లీటర్ల రంగుల్ని వినియోగించారు.
సెప్టెంబర్ 10: నేత్రాలను దిద్దారు
59 అడుగుల ఖైరతాబాద్ త్రిశక్తి మయ మోక్ష గణపతికి గురువారం ఉదయం 6.20 గంటలకు ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేత్రాలను దిద్దారు. మహాగణపతి కంటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. విగ్రహాన్ని ఏ వైపు నుంచి చూసినా అటువైపు మహా గణపతి చూస్తున్నట్టు ఉండడం ఈ ఏడాది ప్రత్యేకత అని రాజేంద్రన్ అన్నారు. సిద్ధాంతి గౌరీభట్ల విఠల్‌శర్మ నిర్ణయించిన ముహూర్తానికే నేత్రాల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు.
విగ్రహ ప్రత్యేకతలివే..
59 అడుగుల మహా గణపతి విగ్రహం
కుడివైపు గజేంద్రమోక్షం
ఎడమ వరంగల్ భద్రకాళి అమ్మవారు