ప్రాథమిక పాఠశాల టీచర్ కు మరణశిక్ష
బీజింగ్: విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన ప్రాథమిక పాఠశాల మాజీ టీచర్ కు చైనాలో మరణశిక్ష విధించారు. నిందితుడు లీ జిషున్ కు గురువారం గాస్సు ప్రావిన్స్ లోని టియాన్ షుయ్ నగరంలో మరణశిక్ష అమలు చేసినట్టు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. 4 నుంచి 11 ఏళ్ల వయసున్న 26 మంది చిన్నారులను అతడు లైంగిక వేధింపులకు గురిచేసినట్టు టియాన్ షుయ్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు నిర్ధారించింది. 2011-2012 మధ్యకాలంలో అతడీ అకృత్యాలకు పాల్పడినట్టు తేల్చింది.
చిన్నపిల్లల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని తరగతి గదులు, హాస్టళ్లలో అత్యాచారాలకు ఒడిగట్టాడని కోర్టు తెలిపింది. ఇలాంటి దురాగతాలు సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయనే భావనతో నిందితుడికి మరణశిక్ష విధించినట్టు న్యాయమూర్తి తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. మరోకేసులో ఐదుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి విధించిన మరణశిక్షను కోర్టు రెండేళ్ల పాటు నిలిపివేసింది. ఇటీవల కాలంలో లైంగిక వేధింపులు కేసులు పెరగడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 2012-2014 మధ్యకాలంలో చైనాలో 7,145 రేప్ కేసులను కోర్టులు విచారించాయి.