కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పరీకర్ హిందూవులను మోసం చేశారని గోవా ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింగ్కర్ గురువారం ఆరోపించారు. కాగా రాష్ట్ర ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవి నుంచి వెలింగ్కర్ ను తొలగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్ర ఆర్ఎస్ఎస్ చీఫ్ గా పనిచేసిన ఆయనను తొలగించడంపై ఇప్పటికే రాష్ట్ర కేడర్ లో 400 మంది సభ్యులు రాజీనామాలు చేశారు.
పదవిని కోల్పోవడంపై మాట్లాడిన వెలింగ్కర్ రానున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడనున్నట్లు చెప్పారు. బీజేపీ, పరీకర్ లను నమ్మిన రాష్ట్ర ప్రజలను వారు మోసం చేశారని అన్నారు. కొంకణి, మరాఠి తదితర భాషలను కాపాడుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పరీకర్.. క్రిస్టియన్ స్కూళ్లను మూసివేసేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మైనారిటీల దేవుడిలా మారిపోయారని అన్నారు.
మాతృభాషలో విద్యను బోధించని పాఠశాలలను మూసివేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రయత్నించగా.. పరీకర్ అడ్డగించారని ఆరోపించారు. బీజేపీతో బంధం తెగితే మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని లేదా స్వతంత్రంగా బరిలోకి దిగుతామని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకూ రాజీపడే ప్రసక్తే లేదని వెలింగ్కర్ అన్నారు.
'పారీకర్ హిందూవులను మోసం చేశారు'
Published Thu, Sep 1 2016 4:11 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
Advertisement