మా దుస్తుల సంగతి మీకెందుకు?
న్యూఢిల్లీ: కురచ దుస్తులు, జీన్స్, టీ షర్ట్స్ ధరించడం వల్ల, అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా రోడ్లపై తిరగడం వల్ల, క్లబ్బులు, పబ్బుల పట్ల మోజు చూపించడం వల్ల, స్మార్ట్ ఫోన్లలో ఛాటింగ్ వల్ల ఆడవాళ్లపై రేప్‌లు పెరుగుతున్నాయని కొంత మంది పురుష పుంగవులు రకరకాలుగా తీర్మానించేస్తున్నారు. సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ మరో అడుగు ముందుకేసి ఓ అమ్మాయిని నలుగురు ఎలా రేప్ చేయగలరని ప్రశ్నించారు. ఇలాంటి ధోరణికి తెరపడాలంటూ ‘నోకంట్రీ ఫర్ విమెన్’ అనే సంస్థ మగవారి మైండ్‌సెట్‌ను మార్చేందుకు సామాజిక వెబ్‌సైట్‌లో ఫేస్‌బుక్‌లో సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ‘నా దుస్తుల వైపు ఎందుకు చూస్తావ్. నీ ఆలోచనలేమిటో ముందు గమనించు’ అనే నినాదంగల పోస్టర్ పట్టుకున్న ఓ అమ్మాయి ఫొటోతో పాటు మగవాళ్లపై పలు సెటైర్లు వేస్తూ ప్రచారానికి రక్తికట్టిస్తోంది.
‘భార్య, బామ్మ, తల్లి, చెల్లి, కూతురు ఇలా ఎవరో ఒకరు తోడు లేకుండా ఎందుకు వీధిలోకి వస్తున్నావు?...ఆ సమయంలో మగవాడు అక్కడేం చేస్తున్నాడు, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లగలననుకుంటున్నాడా, ఏంది?...అందుకనే మేము మగవాళ్లు ఇంట్లోనే ఉండాలని చెబుతున్నాం. అదీ వారి రక్షణ కోసమే....మగవాళ్లు ఇంటి నుంచి బయల్దేరే ముందు ఎందుకు అగ్నిమాపక పరికరాన్ని వెంట తీసుకెళ్లడం లేదు. ఈ రోజుల్లో బయటకొచ్చే ఏ మగాడికి భద్రతా లేదనే విషయం తెలియదా?....మగాడు ఎందుకు బస్సులో పక్కావిడ భుజంపై తలాన్చి నిద్రపోతున్నాడు, జరగబోయే పరిణామం గురించి తెలియదా?....ఎన్నో వీధి కుక్కలు మహిళలను గౌరవిస్తాయి. అన్ని కాదు సుమా!....బస్సుల్లో, రైళ్లలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు, మరి వీధి కుక్కలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించరు? అనే సెటైర్లు ఆ ప్రచారంలో హల్‌చల్ చేస్తున్నాయి. మగవాళ్ల మనస్థత్వంలో, ఆలోచనా ధోరణిలో మార్పు రావాలన్నదే తమ ప్రచార ఉద్దేశమని ‘నో కంట్రీ ఫర్ విమెన్’ సంస్థ ప్రకటించింది.