జనతా దర్బార్ కు ముగింపు పలికిన కేజ్రీవాల్
ఢిల్లీ : ప్రజల సమస్యల పరిష్కారానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనతా దర్బార్ అర్థాంతరంగా ముగిసింది. ఇకమీదట జనతా దర్భార్ నిర్వహించేది లేదని కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. వారానికి ఒకసారి తానే స్వయంగా ప్రజలను కలవనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ కష్టాలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తేవడం కోసం జనతా దర్బార్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిర్వహణ కష్టతరం కావటంతో .... ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులను తీసుకుంటామని కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు జనతా దర్బార్ కు ముగింపు పలకటంతో సామాన్య ప్రజలు నిరుత్సాహం వ్యక్తం చేశారు.
కాగా కేజ్రీవాల్ శనివారం ఢిల్లీ సచివాలయం వద్ద నిర్వహించిన మొట్టమొదటి జనతా దర్బార్‌కు జనం వెల్లువెత్తటంతో రసాభాసగా మారింది. వేలాది మంది ఒక్కసారిగా తరలిరావటంతో ప్రభుత్వం చేసిన ఏరాట్లు, నియంత్రణ చర్యలు ఏమాత్రం సరిపోలేదు. జనం బారికేడ్లను కూలదోసి ముందుకు రావటం, సీఎంను కలవటానికి పోటీపడటంతో పెద్ద ఎత్తున తోపులాట చోటుచేసుకుంది.
తీవ్ర గందరగోళం తలెత్తటంతో కేజ్రీవాల్ అర్ధంతరంగా జనతాదర్బార్‌ను నిలిపివేశారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన అనంతరం మరో వారం రోజుల్లోపలే మళ్లీ జనతాదర్బార్‌ను నిర్వహిస్తామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు జనతా దర్బార్ నిర్వహణపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో జనతా దర్బార్ను ఆప్ సర్కార్ ఆదిలోనే అటకెక్కించింది.