మరోసారి కరెన్సీ రద్దుపై కేంద్రమంత్రి వివరణ!
- రూ. 2వేల నోట్లు రద్దు చేస్తారని ప్రచారం
- తాజాగా స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి గంగ్వర్
న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2వేల నోట్లను త్వరలోనే రద్దు చేయబోతున్నారని సాగుతున్న ప్రచారంపై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్‌కుమార్ గంగ్వర్ స్పందించారు. రూ. 2వేల నోట్లను రద్దు చేస్తున్న సమాచారమేదీ లేదని ఆయన వివరణ ఇచ్చారు. త్వరలోనే రూ. 200 నోట్లు చెలామణిలోకి రానున్నట్టు వెల్లడించారు.
'రూ. రెండువేల నోట్లను రద్దు చేసే వార్తలేవీ లేవు' అని గంగ్వర్ 'ఐఏఎన్‌ఎస్' వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 'రూ. 2వేల నోట్ల ముద్రణను తగ్గించడం అనేది వేరే అంశం. కానీ, దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ధ్రువీకరించాల్సి ఉంది. రూ. 2వేల నోట్లపై ఆర్బీఐ స్పష్టత ఇస్తుంది' అని ఆయన తెలిపారు. రూ. 2వేల నోట్ల ముద్రణను నిలిపివేసినట్టు ఇప్పటికే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రూ. 2వేల నోట్లను రద్దు చేయబోతున్నారంటూ ప్రతిపక్షాలు ఈ నెల 26న పార్లమెంటులో లేవనెత్తిన సంగతి తెలిసిందే. అయినా, ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.