586 చోట్ల దాడులు.. భారీగా నగదు పట్టివేత
586 చోట్ల దాడులు.. భారీగా నగదు పట్టివేత
Published Fri, Dec 16 2016 1:26 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో భారీగా నగదు పట్టుబడింది. మొత్తం 586 ప్రాంతాల్లో జరిపిన సెర్చింగ్ ఆపరేషన్లో దాదాపు రూ.3000 కోట్లు వెలుగులోకి వచ్చినట్టు ఐటీ శాఖ వెల్లడించింది. దానిలో రూ.79 కోట్లు కొత్త కరెన్సీ రూ.2000 నోట్లు కాగ, మిగతా రూ.2,600 కోట్లు లెక్కలో చూపనివని తెలిసింది. పట్టుబడిన నగదులో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో పట్టుబడింది. చెన్నై వ్యాప్తంగా ఏకకాలంలో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో రూ.100 కోట్లకు పైగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో ఆ రాష్ట్రంలో మొత్తంగా రూ.140 కోట్లు పట్టుబడినట్టు తెలిసింది. నగదుతో పాటు రూ.52 కోట్ల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా ఢిల్లీలోని ఓ న్యాయవాది ఇంటి ప్రాంగణంలో జరిపిన తాజా తనిఖీలో రూ.14 కోట్ల నగదు పట్టుబడింది. గత అక్టోబర్లో లెక్కలో చూపని నగదు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయపు వెల్లడి పథకం కింద ఆ లాయరే దాదాపు రూ.125 కోట్లను తను లెక్కలో చూపని నగదుగా ప్రకటించారు. రెండు వారాల క్రితం అతని బ్యాంకు అకౌంట్లను తనిఖీ చేసిన ఐటీ అధికారులు అకౌంట్ నుంచి లెక్కల్లో చూపని రూ.19 కోట్లను సీజ్ చేశారు.
ఐటీ అధికారుల దాడులతో బుధవారం పుణేలోని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఒక వ్యక్తికి సంబంధించిన 15 లాకర్స్ వివరాలను వెల్లడించింది. ఆ 15 లాకర్స్లో రూ.9.85 కోట్ల నగదు ఉందని, వాటిలో రూ.8 కోట్లు కొత్త రూ.2000 కరెన్సీ నోట్లని, మిగతావి రూ.100 నోట్లని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. గత నెలకు సంబంధించిన బ్యాంకు రికార్డులు, సీసీటీవీ పరిశీలించిన బ్యాంకు అధికారులకు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద పెద్ద బ్యాగులతో బయటికి వెళ్లడం, లోపలికి రావడం దానిలో రికార్డు అయ్యాయి. దీంతో బ్యాంకు అధికారులపై సీరియస్ అయిన ఐటీ శాఖ, విచారణ చేపట్టింది. మొత్తంగా పుణే వ్యాప్తంగా జరిపిన ఐటీ దాడుల్లో రూ.10.80 కోట్ల నగదు పట్టుబడింది. వాటిలో రూ.8.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లున్నాయని ఐటీ అధికారులు తెలిపారు..
Advertisement
Advertisement