
2000 రూపాయల నోటుతో కొత్త కష్టాలు
లక్నో: పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవాలంటే గంటల కొద్దీ బ్యాంకుల ముందు పడిగాపులు కాయాలి. ఎకౌంట్లోని డబ్బు డ్రా చేయాలన్నా ఇదే పరిస్థితి. ఇక ఏటీఎంల వద్ద పెద్ద క్యూలో నిల్చున్నా తమ వంతు వచ్చేసరికి అందులో డబ్బు ఉంటుందన్న నమ్మకం లేదు. చాలా ఏటీఎంలలో డబ్బులు లేవు. ఇన్ని కష్టాలు పడి కొత్త 2000 రూపాయల నోటు సంపాదిస్తే మరో సమస్య ఎదురవుతోంది.
కొత్త 2000 రూపాయల నోటును చాలా చోట్ల తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీనికి చిల్లర నోట్లు అందుబాటులో లేకపోవడమే కారణమని చెబుతున్నారు. కొత్త 2 వేల నోటు తీసుకుని వెళితే చిల్లర లేదని వ్యాపారులు చెబుతున్నారని, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వాసి చెప్పారు. రద్దయిన 500, 1000 రూపాయల నోట్ల స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా 2 వేల రూపాయల నోటు అందుబాటులోకి రాగా, 500 రూపాయల నోట్లు ఇంకా రాలేదు. దీంతో 2 వేల రూపాయల నోటు మార్చేందుకు చిల్లర సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కువగా 100, 50 నోట్లే అందుబాటులో ఉన్నాయి. 2 వేల నోటుకు సరిపడా, లేదా కాస్త తక్కువగా సరుకులు తీసుకుంటే నోటు తీసుకుని చిల్లర వాపసు ఇస్తున్నారు. అదే తక్కువ మొత్తంలో కొనేందుకు వెళితే 2 వేల రూపాయల నోటును తీసుకోవడం లేదు