చర్చలు ఇంకా ఖరారు కాలేదు
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు ఇంకా తేదీలు ఖరారు కాలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ విషయంలో పాకిస్థాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదని, ఆ దేశం తన అభిప్రాయం తెలిపాకే భారత్ నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల భారత్-పాక్ మధ్య పలు అంశాలకు సంబంధించి చర్చ జరగాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటంతోపాటు పాక్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలిసిందే.
అయితే, ఇటీవల పాక్ ఉగ్రవాదులు బీఎస్ఎఫ్ బలగాలపై కాల్పులకు పాల్పడటంతోపాటు, సరిహద్దు వెంబడి చొరబాట్లు జరగడం, సైనిక స్థావరాలపై గ్రనేడ్లు విసరడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పలుమార్లు ఉల్లంఘించడంవంటి చర్యలకారణంగా ఈ చర్చలు విషయంలో కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. పాక్ కూడా ఇలాంటి సంఘటనలను అధికారికంగా ఖండించకపోవడం కూడా చర్చలు జరిపే విషయంలో కొంత అనుమానం నెలకొంది. అయితే, చర్చలే అన్ని సమస్యలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న నేపథ్యంలో పాక్ నుంచి అధికారిక ప్రకటనకోసం కేంద్రం ఎదురుచూస్తుంది.