
‘గుజరాత్ మోడల్’ డొల్లతనం బట్టబయలు
- పటేళ్ల ఆందోళనపై బీజేపీ సమాధానం చెప్పాలి
- టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళనకు సిద్ధం
- ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించింది
- ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానిది మోసపూరిత వైఖరి
- వైఎస్సార్‌సీపీ బంద్‌కు సీపీఎం మద్దతు: సీతారాం ఏచూరి
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లో పటేళ్ల ఆందోళనల తో ప్రధాని మోదీ పేర్కొంటున్న ‘గుజరాత్ మోడల్’ డొల్లతనం బట్టబయలైందని, ఈ నమూనా పూర్తిగా విఫలమైందని స్పష్టమవుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఆ రాష్ర్టంలో తలెత్తిన పరిస్థితులకు బీజేపీ కేంద్ర నాయకత్వం, గుజరాత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా మంచిస్థితిలో ఉన్న పటేళ్ల సామాజికవర్గం కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారంటే విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు అందరికీ అందడం లేదని అర్థమవుతోందని చెప్పారు.
నిరసన ర్యాలీపై పోలీసులను విచక్షణారహితంగా ప్రయోగించడం వల్లనే అది అదుపు తప్పిందన్నారు. గురువారం ఎంబీభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బి.వెంకట్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2002 గుజరాత్ అల్లర్ల అదుపునకు సైన్యాన్ని పిలవడంలో తాత్సారం చేశారని, ఇప్పుడు మాత్రం వెంటనే పిలవాల్సి వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు సంబంధించి మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను తమ పార్టీ బలపరిచిందని తెలిపారు. ఈ విధానం అమలు జరిగి ఉంటే గుజరాత్‌లో ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదని అన్నారు.
మోదీ ఏడాదిలోనే విఫలం..
యూపీఏ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడంలో పదేళ్లలో విఫలమైతే.. ఏడాది కాలంలోనే మోదీ తన అప్రయోజకత్వాన్ని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఏ ప్రధానీ వెళ్లని విధంగా మోదీ 24 దేశాలు వెళ్లారని, విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని నమ్మించి చివరకు శూన్యహస్తం చూపారన్నారు. బీహార్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం మతపరమైన విభజన (పోలరైజేషన్) తెచ్చేవిధంగా ముస్లింల జనాభా లెక్కలను కేంద్రం వెల్లడించిందని విమర్శించారు.
భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించిన ఏపీ
రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుతమున్న 2013 కేంద్ర భూసేకరణచట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఏచూరి విమర్శించారు. ‘ల్యాండ్ పూలింగ్’కు వ్యతిరేకంగా తమ పార్టీ ఉద్యమిస్తోందన్నారు. పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయకుండా ఆ దిశలో చర్యలు తీసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు.ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు సీపీఎం మద్దతు ప్రకటించిందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం వైఖరి మోసపూరితంగా ఉందని, ప్రతిపక్షంలో ఉండగా బీజేపీ నాయకులే హామీనిచ్చారని గుర్తుచేశారు.
మతోన్మాదం రాజ్యాంగానికి ప్రమాదం
దేశంలో మతోన్మాదం తీవ్రంగా పెరుగుతోం దని, ఇది భారత రాజ్యాంగానికి ప్రమాదకరమని సీతారాం ఏచూరి అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన గెట్ టూ గెదర్ కార్యక్రమంలో ఆయ న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఆర్థిక దోపిడీ విధానాలను మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని విమర్శించారు. సామాజిక దౌర్జన్యం తీవ్రంగా పెరుగుతోందని, వీటిని అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరంగా పరిణమిస్తోందని చెప్పారు.
కేసీఆర్ మిత్రుడే కానీ
సీఎం కేసీఆర్ తమకు మిత్రుడే కానీ, ఆయ న అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ ఆందోళనలకు సిద్ధంగా ఉం టామని ఏచూరి పేర్కొన్నారు. ప్రజల భా వాలకు అనుగుణంగా రాష్ర్టం ఏర్పడిం దని, వారి బతుకుదెరువు మెరుగుపర్చేలా, వెనుకబాటు తనాన్ని దూరం చేసే చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. ప్రజా సమస్యలపై సామాజిక, వామపక్ష శక్తులతో కలసి సీపీఎం ఉమ్మడిగా పోరాటాలు చేపడుతుందని చెప్పారు.