‘ప్రాణహిత’ డిజైన్ మార్పుపై ప్రకాశ్‌గౌడ్ దీక్ష
శంషాబాద్ రూరల్: చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లాను తప్పించడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ శంషాబాద్‌లో గురువారం ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు అఖిలపక్ష కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ ఉన్నట్టుండి డిజైన్ మార్చడానికి గల కారణాలను అఖిల పక్షానికి వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు డిజైన్ మార్చి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్, టీడీపీలు ఏకమై పోరాటం చేస్తాయని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ తెలిపారు. వైఎస్సార్ తన హయాంలో ‘ప్రాణహిత- చేవెళ్ల’కు జాతీయ హోదాకోసం కృషి చేశారని, కేసీఆర్ మాత్రం ప్రాజెక్టు డిజైన్ మార్చి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు, నీళ్లు, నియామకాలు మనకే చెందుతాయని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కేవలం తెలంగాణలోని ఒక్క ప్రాంతానికే సీఎం అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, ఎంపీలు మల్లారెడ్డి, దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, గోపీనాథ్, అరికపూడి గాంధీ, వివేకానంద, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, టీడీపీ నాయకులు ఎర్ర బెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.