
స్మృతి ఒప్పుకోలేదు.. ప్రకాశ్ చేసేశారు.!
మాజీ మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఒప్పుకోని ఐఐఎం బిల్లు సవరణకు..
దేశ అత్యున్నత మేనేజ్ మెంట్ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం)లకు బోర్డ్ ఆఫ్ గవర్నర్(బీఓజీ)లను నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తూ మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జయదేవకర్ నిర్ణయం తీసుకున్నారు. ఐఐఎంలను స్వతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బీఓజీలను సంస్థలే నియమించుకునే అవకాశాన్ని ఇవ్వాలని పీఎంవో సూచనలు చేసింది.
ఈ ఏడాది మే నెలలో ఐఐఎం-అహ్మదాబాద్ తన బీఓజీగా పేర్కొన్న పేర్లను మానవవనరుల శాఖ మాజీమంత్రి స్మృతి ఇరానీ కాదని వాటిని వెనక్కు పంపిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన ఆర్. శేషసాయి, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు చైర్మన్ దీపక్ పరేఖ్, హీరో మోటర్ కార్ప్ సీఎండీ పవన్ ముంజల్ ల పేర్లలో ఒకరిని ఎంపిక చేయాలని ఐఐఎం-అహ్మదాబాద్ స్మృతిని కోరింది. వీరిలో ఎవరిని ఎంపిక చేయకపోవడానికి కారణం చెప్పకుండా ఆ డాక్యుమెంట్లను స్మృతి వెనక్కు పంపారు.
కొద్దిరోజుల క్రితం మానవ వనరులశాఖ మంత్రిగా ప్రకాశ్ జయదేవకర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పీఎంవో సూచనలకు అనుగుణంగా ఐఐఎంలు సొంతంగా చైర్మన్లను నియమించేందుకు ఆయన అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన బిల్లును కేబినేట్ లో ఆమోదం పొందడానికి సిద్ధమైంది. ఇరానీ హయాంలోని బిల్లులో ఐఐఎం ఎంపిక చేసిన చైర్మన్ అపాయింట్ మెంట్ ను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం రూపొందించిన బిల్లులో ప్రభుత్వానికి చైర్మన్ నియామకంతో ఎలాంటి సంబంధం ఉండదు.