
అది హోం కార్యదర్శి పరిష్కరిస్తారు: రాజ్‌నాథ్‌సింగ్
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-8పై ఉన్న వివాదాన్ని కేంద్ర హోం కార్యదర్శి గోయల్ పరిష్కరిస్తారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు.
* సెక్షన్ 8 వివాదంపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
* ఓటుకు నోటు కుంభకోణంపై చెప్పేదేమీ లేదు
* వివాదాలు సద్దుమణుగుతాయి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-8పై ఉన్న వివాదాన్ని కేంద్ర హోం కార్యదర్శి గోయల్ పరిష్కరిస్తారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఇక్కడి తన కార్యాలయంలో జమ్మూకశ్మీర్‌కు ప్యాకేజీ అంశంపై విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం విలేకరులతో ముచ్చటించినప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సెక్షన్-8పై కేంద్రం జోక్యం ఉంటుందా? అని ప్రశ్నించగా... ‘ఈ విషయమై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం. ఈ వివాదాన్ని ఆయన పరిష్కరిస్తారు..’ అని బదులిచ్చారు. ఓటుకు నోటు కుంభకోణంపై తాను చెప్పేందుకు ఏమీ లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్‌పై వచ్చిన ఫిర్యాదులపై స్పందించేందుకు కూడా ఆయన నిరాకరించారు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఏ వివాదం ఉన్నా వాటిని హోం శాఖ కార్యదర్శి పరిష్కరిస్తారు.. త్వరలోనే వివాదాలు సద్దుమణుగుతాయి..’ అని బదులిచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సెక్షన్-8, ఇతర వివాదాలపై హోం శాఖ కార్యదర్శి గోయల్, సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ త్వరలో హైదరాబాద్ వెళ్లనున్నట్టు హోం శాఖ వర్గాలు తెలిపాయి. ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఉన్నప్పుడు తాము మౌనంగా ఉండడం తప్ప ఈ వివాదంలో జోక్యం చేసుకోజాలమని బీజేపీ అంతర్గతంగా అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఈనేపథ్యంలో కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు విముఖతతో ఉన్నట్టు తెలుస్తోంది. తగిన ఆధారాలు ఉంటే ముందుకెళ్లొచ్చనే సంకేతాలు పంపిందని తెలుస్తోంది.
ఆచితూచి వ్యవహరిస్తున్న కేంద్రం
ఇటీవల ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కలిసినప్పుడు టీ సర్కార్ తరచుగా వివాదాలకు ఆజ్యం పోస్తోందని, హైదరాబాద్‌లో ఆంధ్ర పౌరులను ఇబ్బందులు పెడుతోందని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని, గవర్నర్‌కు సెక్షన్-8 అధికారాలు సంక్రమించినా అమలుచేయడం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గడిచిన ఏడాది కాలంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నట్టు ఒక్క ఫిర్యాదూ రాలేదని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసినట్టు హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హోం శాఖ కార్యదర్శి ద్వారా కూడా సెక్షన్-8 ఉల్లంఘనలపై ఆరాతీస్తున్నట్టు సమాచారం.