చోరీ చేసి లైవ్ టీవీకి చిక్కాడు!
షికాగో: కాలం కలిసిరాకపోతే బ్యాంక్ కు కన్నమేసినా కెమెరా సాక్షిగా అడ్డంగా దొరికిపోతాం. కావాలంటే అమెరికాలోని రొచెస్టర్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి చదవండి.
స్టెర్లింగ్ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ లో జరిగిన చోరీ గురించి లైవ్ రిపోర్టు చేసేందుకు కేఐఎంటీ-టీవీకి చెందిన రిపోర్టర్ ఆడమ్ సాలెట్ మంగళవారం బ్యాంక్ వెలుపల నించునున్నాడు. లైవ్ రిపోర్టు చేస్తుండగా బ్యాంకు నుంచి ఓ వ్యక్తి కంగారుగా బయటకు పరుగులు తీస్తూ వచ్చాడు. సాలెట్ తన సొంత కెమెరాతో అతడిని చిత్రీకరించాడు. ఈ దృశ్యం టీవీలో ప్రత్యక్ష ప్రసారమైంది. తర్వాత అతడు దొంగ అని తెలియడంతో సాలెట్ పోలీసులకు సమాచారం అందించాడు.
'ఓహ్.. అతడు దొంగ!. ది ఈజ్ లైవ్ టీవీ. ఇప్పుడు పారిపోయిన వ్యక్తి దొంగని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. దొంగను పట్టుకోవడానికి 911 నంబర్ కు ఫోన్ చేస్తున్నా. మళ్లీ తర్వాత మాట్లాడతా' అంటూ లైవ్ లో సాలెట్ గడగడ చెప్పేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాలెట్ స్టేట్ మెంట్ తీసుకుని లైవ్ టీవీ పుటేజీ పరిశీలించారు. గంట తర్వాత దొంగను పట్టుకున్నారు.
నిందితుడు రియన్ లిస్కో(36)గా గుర్తించారు. అంతకుముందు రోజే అతడు స్టెర్లింగ్ స్టేట్ బ్యాంక్ దొంగతనం చేశాడు. మరోసారి చోరీకి వచ్చి కెమెరాకు చిక్కాడు. రెండు చోరీలు అతడే చేసినట్టు పోలీసుల కచ్చితంగా చెబుతున్నారు. కాగా, లైవ్ టీవీలో బ్యాంకు దొంగను పట్టిచ్చిన ఆడమ్ సాలెట్ పేరు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది.