స్నేహం కోసం.. త్యాగానికి సిద్ధం!
- ప్రియనేస్తం ములాయం కోసం అమర్ సింగ్ కీలక నిర్ణయం!
- అఖిలేశ్ డిమాండ్ మేరకు మూడు నెలలు పార్టీకి దూరంగా..
లక్నో: ఎవరి కోసమైతే తండ్రీకొడుకులైన ములాయం, అఖిలేశ్‌లు తగువులాడుకుంటున్నారో.. ఆ అమర్‌సింగ్ చివరికి త్యాగానికి సిద్ధపడ్డట్టు తెలిసింది. ప్రియ స్నేహితుడి కొడుకు, తనను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సీఎం అఖిలేశ్ డిమాంఢ్ మేరకు.. ఎంపీ అమర్ మూడు నెలలపాటు రాజకీయ సన్యాసం తీసుకొనబోతున్నారని సమాచారం.
ఈ మూడు నెలలూ పార్టీకి సంబంధించిన అన్ని రకాల నిర్ణయాధికారాలు అఖిలేశ్ తీసుకుంటారు. ఈ అంశం ప్రాతిపదికనే గురువారం రాత్రి నుంచి ములాయం, అఖిలేశ్‌ల నివాసాల్లో ఎడతెరిపిలేకుండా మంతనాలు సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం అనూహ్యంగా బాబాయి శివపాల్ యాదవ్.. అఖిలేశ్ ఇంటికి వెళ్లారు. అటు ఎంపీ అమర్ సింగ్.. ములాయంతో భేటీ అయ్యారు. మరి కొద్ది గంటల్లోనే అమర్ త్యాగానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అంచనా. (ఆయన గుండెల్లో నేను లేని క్షణాన.. )
ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారం సాధించేలా మార్చి వరకు సర్వనిర్ణయాధికారాలూ తనకే కట్టబెట్టాలని సీఎం అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్‌ను కోరినట్లు.. అఖిలేశ్ వర్గీయుడైన మంత్రి రవిదాస్ మల్హోత్రా మీడియాకు చెప్పారు. నేతాజీ(ములాయం) కూడా ఇందుకు మొగ్గుచూపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 214 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పటికే పార్టీని స్వాధీనం చేసుకున్న అఖిలేశ్ యాదవ్.. తండ్రి ములాయంను పార్టీ ‘మార్గదర్శి’గా నియమించారు. పార్టీని తిరిగి కైవసం చేసుకోలేని స్థితిలో ములాయం.. కొడుకుకు జై కొట్టడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని అఖిలేశ్ వర్గంలోని అతివాదులు వ్యాఖ్యానించారు. (ములాయం 'అమర'ప్రేమ రహస్యం)
అఖిలేశ్ డిమాండ్ ప్రకారం అమర్‌సింగ్, శివపాల్ యాదవ్‌లు వచ్చే మూడు నెలల పార్టీకి దూరంగా ఉండేలి. అభ్యర్థుల ఎంపిక సహా ఎలాంటి నిర్ణయాలలో జోక్యం చేసుకోకుదు. అయితే ఈ మాటను ములాయం చేతే చెప్పించాలని అఖిలేశ్ పట్టుపడుతున్నారు. సైకిల్ గుర్తు తమదేనంటూ ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపించేందుకు గురువారం ఢిల్లీ వెళ్లిన ములాయం.. కమిషన్‌ను కలవకుండానే లక్నోకు తిరుగుపయనం అయ్యారు. ఆ విధంగా సైకిల్ గుర్తు అఖిలేశ్‌కే దక్కేలా ములాయం వ్యవహరించారని తేలింది. (మా పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఆయనే!)