నేను అమాయకురాలిని | sanchita padukone interview with sakshi | Sakshi
Sakshi News home page

నేను అమాయకురాలిని

Published Sun, Oct 4 2015 8:39 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

నేను అమాయకురాలిని

నేను అమాయకురాలిని

 అబ్బో నేను అమాయకురాలిని అంటున్నారు వర్ధమాన హీరోయిన్ సంచిత పదుకొనే. తెలుగు, తమిళ, కన్నడ భాష చిత్రాల్లో బుడిబుడి అడుగులు దాటుకుని వడి వడి అడుగులకు చేరుకుంటున్నారు సంచిత పదుకొనే. తొలి చిత్రంతోనే కెరీర్ బ్రేక్ రావడం సినీ ప్రయాణం ఆమెకు సులువుగా మారింది. అంతేకాదు పొరుగు భాషల్లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం చేసింది. మూడు భాషల్లో కలిపి చేసింది ఆరు సినిమాలే అయినా ఆశించిన దానికంటే ఎక్కువగానే గుర్తింపు తెచ్చుకున్నారు సంచిత. మాతృభాష కన్నడంపై మమకారంతోపాటు తమిళంపై తరగని ప్రేమ, తెలుగుదనంపై తీయనైన తపన ఉందంటున్నారు సాక్షితో సంచిత పదుకొనే.
 
 దక్షిణాది భాషలన్నింటిలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలనేదే నా ఆకాంక్ష. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడంతో మూడు దక్షిణాది భాషల్లో నటించాను. మలయాళం ఒక్కటే మిగిలి ఉంది. నటిగా నా కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి విశ్లేషించుకుంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. బెంగళూరులో నివాసం ఉంటూ హైదరాబాద్‌లో షూటింగులకు హాజరుకావడం కష్టం కాబట్టి నా మకాంను శాండల్‌వుడ్ నుంచి టాలివుడ్‌కు మార్చుకుంటున్నాను.
 
త్వరలో హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నాను. తెలుగు చిత్రసీమలో నా అభిమాన హీరోహీరోయిన్లు ఎవరంటే ప్రభాస్, అనుష్క అనే చెబుతాను. అనుష్క నటించిన కాదు...కాదు జీవించిన అరుంధతి సినిమాలోని పాత్రలాంటిది చేయాలని ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల్లో నటిగా సత్తా చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గట్స్ ఉన్న పాత్రలంటే మరీ ఇష్టం.
 
 ప్రస్తుతం నేను నటిస్తున్న చిత్రాల్లో చూడామణి సినిమాలో హార్రర్ పాత్ర పోషిస్తున్నాను. నటనకు అవకాశం ఉన్న పాత్ర వచ్చింది. కన్నడం మాతృభాషతోపాటు తమిళం, తెలుగు సినిమాల్లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకునేందుకు కృషి చేస్తున్నాను. నటన, నాట్యంలో శిక్షణ తీసుకోలేదు, అమాయక విద్యార్థినిగా ఉన్న నేను అసలు నటిని ఎలా అయ్యాను అనుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నాలోని నటిని వెలికితీసి ప్రేక్షకులు మెచ్చేలా నన్ను తీర్చిదిద్దిన దర్శకులకు, అవకాశాలు ఇచ్చిన నిర్మాతలకు, నా హీరోలకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
 
చెన్నై : మాది కర్ణాటక రాష్ట్రం మంగళూరు. మా ఫ్యామిలీలో ఎవ్వరూ సినిమా రంగంలో లేరు. నాకు కూడా సినిమా నటిని అవ్వాలనే కోరికా ఉండేది కాదు. విద్యార్థిగా కూడా నేను చాలా అమాయకురాలిని. నేనేంటో, నా చదువేంటో అన్నట్లుగా ఉండేదాన్ని. పెద్ద చదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని కలలు కనేదాన్ని. ‘మ్యాన్ ప్రపోజల్..గాడ్ డిస్పోజల్’ అన్నట్లుగా (మనిషి ఒకటి తలిస్తే దైవం మరోటి తలుస్తాడు) దైవం నన్ను సినిమా నటిగా దీవించాడు. అందుకే సినిమా అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
 
ప్లస్‌టూ చదువుకుంటున్న సమయంలో అంటే 2009లో నీలకంఠ అనే మా మామ నా మిత్రుడు సినిమా తీస్తున్నాడు, నీవు చేయాలి అన్నాడు. అయ్యో నేరుగా సినిమాల్లోకే నాకు నటన ఏమీ తెలియదు అని నిరాకరించా. మొదట్లో ఎవ్వరికీ తెలియదు, క్రమేణా అందరూ నేర్చుకుంటారు అని నచ్చజెప్పి ఒప్పించాడు. అలా నా జీవితంలో తొలి తెరంగేట్రం కన్నడ సినిమా రావణతో మొదలైంది.
 
తమిళ మాతృక కాదల్‌కొండేన్ చిత్రానికి ఇది రీమేక్. రావణ సూపర్ డూపర్ హిట్ కావడంతో మొదటి చిత్రమే హీరోయిన్‌గా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. అంతేకాదు వరుసగా అవకాశాలు రావడంతో చదువుకు కూడా బ్రేక్ పడింది. తొలి చిత్రం రావణ సెట్స్‌పై ఉన్నపుడే రెండవ సినిమా నా అభిమాననటుడు విజయ్‌తో వేట్టైక్కారన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. హీరోయిన్ కాకపోయినా గుర్తింపు ఉన్న పాత్ర, పైగా నా అభిమాన హీరో కావడంతో ఆనందంగా ఓకే చెప్పేశాను.
 
 ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. మూడవ సినిమా పిళ్లైయార్ తెరు కడసివీడు కూడా తమిళమే. ఆ తరువాత తెలుగు సినిమా పరంపర ప్రారంభం అయింది. నాల్గవ సినిమా చమ్మక్ చల్లో, ఐదవ సినిమా ‘చూడామణి’, ఆరవ సినిమా ‘క్రూరుడు..కాని ప్రేమికుడు’ అన్నీ తెలుగు సినిమాలే. ఒకటి పూర్తికాగా, మిగిలిన రెండు సెట్స్‌పై ఉన్నాయి. తొలి సినిమాలో యోగేష్ హీరోగా నటించగా, విజయ్, జతిన్ రమేష్, వరుణ్ సందేశ్, నవీన్ సంజయ్, ఓంకార్ ఇలా వరుసగా ఇప్పటి వరకు నా హీరోలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement