అయోధ్య, వారణాసి, మథురలకు ఉగ్ర ముప్పు!
న్యూఢిల్లీ: అయోధ్య, వారణాసి, మథురలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆయా ప్రదేశాల్లోని ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. కేంద్ర హోం కార్యదర్శి అనిల్ గోస్వామి అధ్యక్షతన గురువారమిక్కడ సమావేశం జరిగింది. దీనికి సీఆర్‌పీఎఫ్ డీజీపీ దిలీప్ త్రివేది, ఉత్తరప్రదేశ్ డీజీపీ ఏఎల్ బెనర్జీ, ముఖ్య కార్యదర్శి(హోం) దీపక్ సింగ్ సింఘాల్ తదితరులు హాజరయ్యారు. నిఘావర్గాల హెచ్చరికలపై సమావేశంలో చర్చించారు. ఆయా ప్రదేశాల్లోని ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రార్థనా స్థలాల వద్ద మరిన్ని సీసీటీవీ కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతేగాక మరిన్ని దళాలను మోహరించాల్సిందిగా ఆయా ప్రదేశాల పరిరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ను కోరారు. ఒకవేళ ఉగ్రవాదులు దాడికి పాల్పడితే... సమర్థంగా తిప్పికొట్టేలా సీఆర్‌పీఎఫ్ దళాలను సదా సన్నద్ధంగా ఉంచాలని సూచించారు. గతంలో అయోధ్య, వారణాసిల్లో ‘ఉగ్ర’దాడులు జరగడం తెలిసిందే.