'మాజీ మంత్రి అరెస్టు కోసం పోలీసుల హంటింగ్ '
న్యూఢిల్లీ: భార్యను హింసించిన కేసు నుంచి బయటపడేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతీ ముప్పుతిప్పలు పడుతున్నారు. ఓ పక్క ఎక్కడ కనిపిస్తే అక్కడే ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలించాలని పోలీసులు చూస్తుండగా వారికి మాత్రం ఆయన జాడ ఏ మాత్రం దొరకడం లేదు. తనను అరెస్టు చేయకుండా ఉండేలా పోలీసులను ఆదేశించాలంటూ సోమనాథ పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం ఆయన నివాసానికి, మరో బృందం ఆయన కార్యాలయానికి వెళ్లాయి.
కానీ ఆ రెండు చోట్ల ఆయన లేకపోవడంతో పోలీసులు ఇప్పుడు ఆయనకోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సౌత్ వెస్ట్ జాయింట్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ మీడియాతో మాట్లాడుతూ సోమనాథ భారతీ అరెస్టు నుంచి తప్పించుకుంటున్నారని చెప్పారు. తమ వద్ద ఆయన భార్య లిపికా మిత్రా చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు లిఖిత పూర్వక ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. పోలీసులు ప్రస్తుతం ఆయనకోసం గాలింపులు మొదలుపెట్టారని వివరించారు.