గృహహింస, హత్యాయత్నం కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు.
న్యూఢిల్లీ: గృహహింస, హత్యాయత్నం కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. మంగళవారం ఢిల్లీ కోర్టు ఈ మేరకు ఆదేశించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం సోమ్నాథ్ భారతి ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన్ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ నిమిత్తం సోమ్నాథ్ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోరగా.. సోమ్నాథ్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం సోమ్నాథ్ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది.