ఖైరతాబాద్లో తొక్కిసలాట : భక్తులకు గాయాలు
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాదం పంపిణీ సందర్భంగా శుక్రవారం భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. 11 రోజుల పాటు ఖైరతాబాద్ మహాగణపతి చేతిలో విశేష పూజలందుకున్న మహాలడ్డూ ప్రసాదాన్ని ఈ నెల 30న పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పోలీస్ బందోబస్తుకు వీలు కాకపోవడంతో ఆక్టోబర్ 2వ తేదీ పంపిణీ చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
దీంతో ప్రసాదం కోసం భక్తులు శుక్రవారం అధిక సంఖ్యలో ఖైరతాబాద్ తరలివచ్చారు. మింట్ కాంపౌండ్‌వైపు ఉన్న మహిళా క్యూ లైన్, రైల్వేగేటు వైపు ఉన్న పురుషుల క్యూలైన్ బారీగా జనంతో నిండిపోయారు. ఉదయం 7 గంటలకు లడ్డూ దాత, సురుచీఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు పూజలు చేశారు. ఆ తరువాత ఆనవాయితీ ప్రకారం మల్లిబాబుకు లడ్డూలో 50 శాతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా స్థానిక నాయకులు అడ్డుకున్నారు.
50 శాతం ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు. దీంతో మల్లిబాబుకు స్థానిక నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని మల్లిబాబుకు 15 శాతం లడ్డూను ఇచ్చి పంపించేశారు. అనంతరం భక్తులకు ప్రసాద పంపిణీ ప్రారంభమైంది. ప్రసాదం కోసం ఒక్కసారిగా అందరూ ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది.
దీంతో స్థానిక బీజేపీ నాయకుడికి తలకు తీవ్రగాయమైంది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డితో పాటు పలువురు పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రసాద పంపిణీని నిలిపివేశారు. ప్రసాద పంపిణీ పూర్తయిందని మెగాఫోన్‌లో ప్రకటించారు. భద్రత నడుమ మిగిలిన లడ్డూను వాహనంలో తరలించారు.