
రూ.2 వేల నోటు టెస్టింగ్ వీడియో సంచలనం
న్యూఢిల్లీ: నాన్ బ్రేకబుల్ వస్తువులను ఎత్తయిన ప్రదేశాలనుంచి కిందపడేసి టెస్ట్ చేయడం చూశాం....వాటర్ ప్రూఫ్ స్మార్ట్ఫోన్లు పరీక్షించడం చూశాం.. ఇపుడు రెండు వేల రూపాయల నోటు వంతు వచ్చింది. అవును.. కొత్తగా ప్రజల చేతుల్లో కళకళలాడుతున్న రెండువేల నోటును కడుగుతున్న వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుంది. ట్యాప్ లోంచి ధారాళంగా పడుతున్న నీటి కింద రూ.2000 నోటును ఒక వ్యక్తి కడుగుతున్న వీడియో ఒకటి సంచలనం రేపుతోంది. ఎవరు..ఎక్కడ చేశారు అనేవివరాలు తెలియనప్పటికీ.. ఆదివారం సోషల్ మీడియా షేర్ అయిన క్షణాల్లో వైరల్ అయిది. లక్షల కొద్దీని వ్యూస్ ను సొంతం చేసుకుంటూ యూ ట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ లాంటి ఇతర సోషల్ మీడియాలలో ట్రెండింగ్ టాపిక్గా మారింది.
కాగా కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టేందుకు దేశంలో 500, 1000 రూపాయల నోట్ల చలామణిని రద్దుచేసింది. ఈ క్రమంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చాయి. అయితే ఈ కొత్త నెట్ సెక్యూరిటీ ఫీచర్స్ పై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అపుడే నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చాయనే వార్తలు ప్రజల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.