
సంస్కరణలతోనే ఐరాసపై నమ్మకం
* సవాళ్లను ఎదుర్కోవాలంటే ఐరాస శక్తిమంతం కావాలి
* సంస్కరణలు తప్పనిసరి..పేదరికాన్ని నిర్మూలిస్తేనే సుస్థిర అభివృద్ధి
* టెక్నాలజీని సంపన్న దేశాలు ఇతరులకు పంచాలి
* ఉద్గారాల తగ్గింపులో సంపన్న దేశాలు తమ బాధ్యతలను నెరవేర్చాలి
* ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలో ప్రధాని మోదీ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలను అమలు చేస్తేనే దానికి విశ్వసనీయత కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరాస ఏర్పడిన కాలం నాటి పరిస్థితులకు, ఊహించని స్థాయిలో ప్రపంచం మారిపోయిన నేటి పరిస్థితులకు చాలా తేడా ఉందని.. ఈ నేపథ్యంలో సంస్కరణలు తప్పనిసరి అని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 70వ భేటీలో మోదీ కీలక ప్రసంగం చేశారు. ‘‘ఈరోజు మనం ఒక కొత్త దిశానిర్దేశాన్ని నిర్ణయించటానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రస్తుతం ప్రపంచంలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థ అయిన ఐరాస శక్తిమంతం కావలసిన అవసరం ఉంది.
ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి సమర్థమైన వ్యవస్థగా ఐరాస పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది’’ అని మోదీ స్పష్టం చేశారు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం చాలాకాలంగా భారత్ పోటీ పడుతున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. వాతావరణ మార్పు, సుస్థిరమైన అభివృద్ధి అనేవి ప్రపంచ దేశాలన్నింటి సమష్టి బాధ్యత అని మోదీ ఉద్ఘాటించారు.
ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క దేశం కూడా ఎలాంటి ముప్పునూ ఎదుర్కోవటానికి వీల్లేదని ఆయన అన్నారు. పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలు కలసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచంలో 130 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారని, వీరిని అందులోంచి బయటకు తీసుకురావటం కోసం సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలన్నారు.
వాతావరణ మార్పుల విషయంలో ఉమ్మడి బాధ్యతతో పాటు తమ వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వహించాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతను నెరవేర్చాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, సృజన, అర్థ వ్యవస్థలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో నిస్వార్థంగా పంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘నేను భూమిని తల్లిగా భావించే ఉన్నత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
ఆ భూమిని మనం అంతా పిల్లలమని భావిస్తాం. అంతే కాదు.. ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని(వసుధైక కుటుంబం) భావించే సమాజం మాది. అందుకే ప్రతి చిన్న చిన్న ద్వీప దేశాలతో కూడా అభివృద్ధిలో భాగస్వాములమవుతున్నాం. ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నా’’ అని మోదీ సర్వప్రతినిధి సభ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇందుకోసమే తాను ‘నీలి విప్లవా’న్ని సమర్థిస్తున్నానని ఆయన అన్నారు. ‘నీరు కలుషితం కావద్దు. ద్వీప దేశాల రక్షణ, అభివృద్ధి జరగాలి.. ఆకాశం నీలంగా స్వచ్ఛంగా ఉండాలి...ఇదే నీలి విప్లవం’ అని మోదీ చెప్పారు. ఐరాస సర్వప్రతినిధి సభ శుక్రవారం ఆమోదించిన ‘2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’ను ప్రస్తావిస్తూ.. భారత లక్ష్యాలు ఈ డ్రాఫ్ట్‌కు అద్దం పడుతున్నాయని చెప్పారు.
అభివృద్ధి వికాసంలో వ్యక్తిగత రంగం
ప్రపంచంలో ఆర్థిక వికాస చర్చ జరిగిన ప్రతిసారీ ప్రభుత్వ, ప్రయివేటు రంగాల గురించి మాత్రమే చర్చ జరుగుతూ ఉంటుందని.. భారత్‌లో తాము మాత్రం కొత్తగా పర్సనల్ సెక్టార్(వ్యక్తిగత రంగం)ను కొత్తగా ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. వ్యక్తిగత పరిశ్రమల స్థాపన, స్టార్ట్‌అప్‌లను ప్రోత్సహించటం.. ప్రతి ఒక్కరికీ, నివాసం, విద్యుత్తు, నీరు, వంటి వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో అందించడానికి పనిచేస్తున్నామన్నారు.
పేదరిక నిర్మూలనకు అనేక పథకాలు..
భారత దేశంలో సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టామని మోదీ వివరించారు. పేదరికాన్ని ఓడించటానికి పేదలకు విద్య, నైపుణ్యాన్ని అందించటం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. 180 లక్షల బ్యాంకు ఖాతాలను భారత్‌లో పేదలు తెరిచారని, ప్రభుత్వం అందించే ఫలాలు నేరుగా వారి ఖాతాల్లోకి చేరుతున్నాయన్నారు. పేదల కోసం బీమా, పింఛను ప్రయోజనాలను అందిస్తున్నామని తెలిపారు. మహిళల సాధికారత కోసం బేటీ బచావ్, బేటీ పడావ్, మార్కెటింగ్‌లో రైతులకు ప్రయోజనాలను కల్పించటం కోసం కృషి చేస్తున్నామన్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఐరాస ఆమోదం
న్యూయార్క్: వచ్చే 15 ఏళ్లలో పేదరికం, ఆకలి నిర్మూలన, లింగ సమానత్వం తదితరాలతో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ)లకు ఐక్యరాజ్య సమితి శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ‘మన ప్రపంచాన్ని మార్చడం.. సుస్థిర అభివృద్ధి-2030 లక్ష్యాల ఎజెండా కొత్త ముసాయిదాను సర్వ ప్రతినిధి సభ ఆమోదించింది. ఇందులో 17 లక్ష్యాలు, 169 గమ్యాలు ఉన్నాయి. ఇది సంపద పంపకం, శాంతి స్థాపనకు పిలుపని ఐరాస చీఫ్ బాన్‌కి మూన్ అన్నారు. అంతకు ముందు మోదీ.. మూన్‌తో భేటీ అయ్యారు.