టర్కీలో తీవ్రవాద దాడిని ఖండించిన యూఎస్
వాషింగ్టన్ : టర్కీ రాజధాని అంకారాలో తీవ్రవాదుల దాడిని ఆదివారం అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ తీవ్రంగా ఖండించింది. ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించింది. అంకారాలో నిన్న జరిగిన ఈ దారుణం క్రూరమైనదని ఆ దేశ జాతీయ భద్రత మండలి ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ఈ మేరకు శనివారం నెడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నెడ్ ఆకాంక్షించారు. టర్కీ ప్రభుత్వానికి తాము మద్దతు కొనసాగిస్తామని నెడ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
టర్కీ రాజధాని అంకారాలో శనివారం ఉగ్రవాదులు పంజా విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకి సిద్ధమవుతున్న అతివాద, కుర్దుల అనుకూల నిరసనకారులు లక్ష్యంగా రెండు వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. అంకారాలోని ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ జంట పేలుళ్లలో ఇప్పటి వరకు 95 మంది మరణించారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఘటనాస్థలిలోనే 62 మంది మృత్యువాతపడగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో 33 మంది కన్నుమూశారని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. శక్తిమంతమైన బాంబు పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.