అంకారా: యెమెన్‌లోని హౌతీ గ్రూపు స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు హౌతీలపై అవసరమైన దానికంటే ఎక్కువ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. హౌతీలపై దాడులకు దిగడం ద్వారా ఎర్ర సముద్రాన్ని రక్త సముద్రంగా మార్చేందుకు అమెరికా, బ్రిటన్ ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
వివిధ మార్గాల ద్వారా తమకు అందుతున్న సమాచారం ప్రకారం అమెరికా, బ్రిటన్‌ల దాడుల నుంచి హౌతీలు తమను తాము రక్షించుకుంటూ సరైన రీతిలో స్పందిస్తున్నారని ఎర్డోగాన్ తెలిపారు. తాము కూడా అమెరికా, బ్రిటన్‌ల దాడులపై అవసరమైన రీతిలో స్పందిస్తామని చెప్పారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూపు మిలిటెంట్లు ఎర్ర సముద్రం నుంచి వెళ్లే వాణిజ్య నౌకలపై డ్రోన్‌లు, మిసైళ్లతో దాడులకు దిగుతున్నారు. ఈ దాడులు ఎక్కువవడంతో అమెరికా, బ్రిటన్‌లకు చెందిన వైమానిక బలగాలు తాజాగా యెమెన్‌లోని హౌతీ గ్రూపు స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిపి పలు స్థావరాలను ధ్వంసం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment