
సీఎం ఎందుకు రాలేదు?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గైర్హాజరవడం చర్చనీయాంశమైంది.
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లను ఆహ్వానించారు. దీనికి సీఎం కిరణ్ రాకపోవడం వెనుక వేరే కారణాలున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏఐసీసీ, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నానని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదికి కిరణ్ లేఖ రాసినప్పటికీ అంతర్గతంగా సొంత ప్రయోజనాలను ఆశించే వ్యూహాత్మకంగా ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. సీఎంకు సమైక్యవాదంపట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏఐసీసీ ప్రవేశపెట్టబోయే తీర్మానాలతోపాటు పలు ఇతర అంశాలపై తన అభిప్రాయాలను అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల ముందు నిష్కర్షగా చెప్పే అవకాశం ఉండేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కీలకమైన ఈ భేటీకి సీఎం రాకపోవడం పెద్ద తప్పిదమని, సొంత ఎజెండా పెట్టుకున్నందునే దీనికి రాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు కీలక సమావేశం జరుగుతుండగా.. మరోవైపు సీఎం కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఫ్లెక్సీలు దర్శనమివ్వడంపట్ల సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సీడబ్ల్యూసీ భేటీకి కిరణ్ హాజరై విభజనను వ్యతిరేకిస్తున్నానని, మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమైక్య రాష్ట్రం కొనసాగాలని కోరుకుంటున్నందున ఏఐసీసీ సమావేశంలో ఆ మేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని కోరి ఉంటే... ఆయన హీరో అయ్యేవారు’’అని విశ్లేషించారు. రాయలసీమకు చెందిన మరో మంత్రి మాట్లాడుతూ..‘‘కిరణ్ కొత్తపార్టీ కాదు కదా.. కనీసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసే పరిస్థితీ లేదు. చివరిక్షణం దాకా సీఎంగా కొనసాగాలని ఎత్తులేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.