మహిళను పెళ్లాడిన మహిళ!
జలంధర్: ఓ మహిళను మరో మహిళ పెళ్లాడిన ఘటన పంజాబ్‌లో జరిగింది. ప్రభుత్వ అధికారిని అయిన మంజీత్ కౌర్ సంధూ గత శనివారం 27 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జలంధర్ నగరంలోని ఓ దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లి వేడుకలో సమీప బంధుమిత్రులు పాల్గొన్నారు.
గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న మంజీత్ కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా తన 'భార్య'ను ఇంటికి తెచ్చుకున్నారు. వీరి పెళ్లి జరిగిన కాసేపటికే వివాహం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో స్థానికంగా హల్‌చల్ చేశాయి. వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో మిశ్రమస్పందన వ్యక్తమవుతున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్వలింగ వివాహాలు నేరం కింద వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.