ఆ బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది
వైఎస్సార్‌సీపీ శ్రేణులకు విజయమ్మ ఉద్బోధ
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ ఎత్తుగడలు చూస్తుంటే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఈ బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది’ అని వారికి ఉద్బోధించారు. సీమాం ధ్ర ఉద్యమం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయమ్మ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విభజన విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీల వైఖరిని ఆమె తీవ్రంగా ఎండగట్టారు. సమైక్యాంధ్ర విషయంలో అవి రెండూ నాటకాలాడుతున్నాయంటూ దుయ్యబట్టారు. ‘‘వారి వాలకం చూస్తూంటే హఠాత్తుగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించేలా ఉంది.
కనుక అలా జరగకుండా ఉండేందుకు, ‘కాంగ్రెస్, టీడీపీ నేతలు ముందే పదవులకు రాజీనామాలు చే యాలి’ అని వైఎస్సార్‌సీపీ నేతలు ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి’’ అన్నారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే రాజకీయ సంక్షోభం సృష్టించడం తప్పనిసరి. అందుకోసం సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజీనామా చేయాలి. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయనతో పాటు వారి ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ‘ఆంటోనీ కమిటీ వేశాం, సమస్యలు చెప్పుకోండి అని కాంగ్రెస్ పార్టీ ఓ వైపు చెబుతూ.. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతుందంటోంది. కేంద్ర హోంమంత్రి షిండే నోట్ తయారైందంటున్నారు. ఇలాంటి సమయంలో సమైక్యోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది’ అని వైఎస్సార్‌సీపీ నేతలకు వివరించారు. రాజశేఖరరెడ్డి నినాదమే పార్టీ విధానమన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అదే స్ఫూర్తి, బాధ్యతతో 2014 ఎన్నికల్లో పని చేయాలని కోరారు.
వైఎస్ ప్రాంతాలు, మనుషులను వేరుగా చూడలేదు: విజయమ్మ
రాష్ట్రంలోని ఏ జిల్లా, ఏ గ్రామమైనా ఓటు అడిగే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని విజయమ్మ అన్నారు. ‘‘రాజశేఖరరెడ్డి తాను చేసిన మంచి పనుల వల్ల అందరి హృదయాల్లో ఉన్నారు. ఆయన తన హయాంలో ఏనాడూ ప్రాంతాలు, మనుషులను వేరుగా చూడలేదు. అందరినీ ప్రేమించారు. సంతృప్త స్థాయిలో అన్ని ప్రాంతాలు, వర్గాల వారికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ప్రజలపై ఒక్క పైసా భారం వేయకుండా దేశ చరిత్రలోనే లేనివిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం మరో ప్రాంతానికి హాని చేసే పనులు వైఎస్ ఏనాడూ చేయలేదు. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ తనవారే అనుకొని మూడున్నర దశాబ్దాల పాటు ప్రజలకు అండగా ఉన్నారు’’ అని గుర్తు చేశారు.
సమైక్యమే జగనన్న అభిమతం: షర్మిల
సమైక్యాంధ్ర ఉద్యమంలో పార్టీ శ్రేణులు మరింత ఉధృతంగా పాల్గొనాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపు నిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారని అభినందించారు. ‘‘రాష్ట్ర విభజన జరగరాదనేది, అప్పుడే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నది జగనన్న ప్రగాఢ అభిమతం. అందుకు అనుగుణంగా పార్టీ రూపొందించిన ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లండి. అన్నిచోట్లా ఒకే రోజున ఒక్కసారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని జగనన్న చెప్పమన్నారు.
అందుకే నెల రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను పార్టీ ప్రకటిస్తోంది. విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీల నేతలే మళ్లీ ప్రజల్లోకి వచ్చి సమైక్యాంధ్ర అంటున్నారు. వారి ద్వంద్వ వైఖరిని ఎండగట్టండి. భేటీలో పీఏసీ కోఆర్డినేటర్ కొణతాల రామకష్ణ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పీఏసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ముఖ్య నేతలు భూమా శోభానాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జూపూడి ప్రభాకరరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మ, దాడి వీరభద్రరావు తదితరులు మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కన్వీనర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, సీజీసీ, సీఈసీ సభ్యులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో ‘సమైక్య’ తీర్మానం
శనివారం జరిగిన వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం పలు డిమాండ్లతో కూడిన తీర్మానాలను చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించినట్టు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. అవి...
- తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.
- విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఏ దశలోనూ అడ్డుకోలేకపోయిన సీఎం కిరణ్, తీరా ప్రకటన వచ్చాక సమైక్యవాదం ఆలపించడం కంటితుడుపే. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేదాకా కేబినెట్ నోట్ రాదంటూ ఇంతకాలం కాలయాపన చేసిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం రాజీనామాలు చేసి విభజనను అడ్డుకోవాలి.
- రాష్ట్ర విభజనకు అనుకూలంగా బ్లాంక్ చెక్ మాదిరిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి.ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి రాష్ట్రం విడిపోకుండా చూడాలి.
- విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో పెల్లుబికిన ప్రజా ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వివిధ రాజకీయేతర జేఏసీలకు పార్టీ అభినందనలు తెలపాలి. సమైక్యాంధ్రపై స్పష్టత ఇవ్వకుండా డ్రామాలాడుతున్న పార్టీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా వైఖరిని మార్చుకునేలా జేఏసీలు మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఆ పార్టీల ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసేలా ఒత్తిడి చేయాలి.
- నిర్బంధంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బయటకు రాలేని పరిస్థితుల్లో 3,112 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఆయన సోదరి షర్మిలకు, ఆమెతో పాటుగా అడుగులో అడుగు వేసి నడిచిన నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ అభినందనలు తెలియజేస్తోంది.
మరింత ఉధృతంగా ఉద్యమం : వైఎస్ విజయమ్మ
Published Sun, Sep 22 2013 2:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement