అస్తమించిన ‘అరుణతార’
సందర్భం
ఒక శకం ముగిసింది. క్యూబా విప్లవ నిర్మాత, సోషలిస్టు విప్లవ దిగ్గజ నేతలలో చివరి శిఖరం ఫిడెల్ క్యాస్ట్రో కన్ను మూశారు. లాటిన్ అమెరికా దేశాలకే కాదు.. వెనుకబడిన దేశాల నేత లకు, ప్రజలకు స్ఫూర్తి కలిగించిన మహా మేరువు అస్తమించింది. అమెరికా వంటి ప్రపంచాధిపత్య శక్తితో ఢీ అంటే ఢీ అని తలపడి చివరి క్షణం వరకు ధిక్కరించిన ధీశాలి ఫిడెల్. అందుకే... ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా తొలి సారి పిడెల్ క్యాస్ట్రోను కలిసిన నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. ‘ప్రపంచంలోనే అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించారు గనుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను’ అని ప్రశంసిం చారు. ‘అమెరికాకు క్యూబా 90 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్న విషయం మర్చిపోవద్ద’ని అమెరికా అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెన్నడీ హెచ్చ రికను తిప్పికొడుతూ ‘క్యూబాకు అమెరికా కూడా 90 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్న వాస్తవాన్ని మర్చిపోవద్ద’ని ఫిడెల్ ప్రతి హెచ్చరిక చేసిన ప్పుడు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది.
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన దేశంగా క్యూబాను నిలిపిన దృఢ వ్యక్తిత్వం ఫిడె ల్‌ది. విద్యలో నూటికి నూరు శాతం అక్షరాస్యత గలిగిన అతి కొద్ది దేశాల్లో క్యూబా ఒకటి. కానీ ఆరోగ్యరంగంలో ఏ దేశం కూడా తన దరిదాపు ల్లోకి కూడా రానంత శిఖరస్థాయి ప్రమాణాలను నెలకొల్పిన ఘనత ఫిడెల్ సొంతం. గుంటూరు జిల్లా అంత విస్తీర్ణం లేని క్యూబా నేడు లాటిన్ అమెరికన్ దేశాలన్నింటికీ 17 వేల మంది వైద్యు లను అందించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అమెరికా నిత్య దిగ్బంధంలోనూ తనను ఆదుకున్న సోవియట్ యూనియన్ కుప్పగూలి పోయి, క్యూబాకు ఆయువులాంటి ఆయిల్ సర ఫరా నిలిచిపోయినప్పుడు క్యాస్ట్రో ఒకటే పిలుపు నిచ్చారు. ‘చమురు లేకపోతే మనం బతకొద్దా.. మళ్లీ వెనక్కు వెళ్లి గుర్రాల మీద ప్రయాణం చేద్దాం. గుర్రాలతో సేద్యం చేద్దాం’ అంటూ జాతి మొత్తానికి దిశానిర్దేశం చేసిన వాడు ఫిడెల్. సోష లిజం కోసం ఇంత హింసాకాండకు పాల్పడాలా? అని క్యూబన్ నేతలను ప్రశ్నిస్తే విప్లవం గెలిచిన గత అయిదేళ్లలో 50 లక్షల మంది పిల్లలను కాపా డుకోగలిగాం. ఇందుకోసం ఎలాంటి హింసకూ మేం పాల్పడలేదు అంటూ ఫిడెల్ జవాబిచ్చారు.
గతంలో నేను క్యూబా సందర్శించాను. దేశంలో ఏ ప్రాంతంలో కూడా క్యాస్ట్రో ఫొటో కానీ, విగ్రహం కాని లేదు. క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ నేతలను ఈ విషయమై ప్రశ్నించాను. మను షులు తప్పులు చేస్తారు. చనిపోరుున వ్యక్తులను మాత్రమే అమరవీరులుగా మేం ఆరాధిస్తాం అని సమాధానమిచ్చారు. అలాగే క్యూబాలో 10 లేదా 12 ఏళ్ల వయసు పిల్లలను ‘మీకు సామ్రాజ్య వాది కనబడితే ఏం చేస్తారు?’ అని అడిగాను. ‘షూట్ హిమ్ డౌన్’ అని సమాధానమిచ్చారు వారు. క్యూబాకు సామ్రాజ్యవాదులు ఏం చేశారన్న ప్రశ్నకు తిరుగులేని జవాబది.
మా పురోగమనంలో సోవియట్ యూని యన్ సాయం నిర్ణయాత్మకం అని పదే పదే ప్రక టించి కృతజ్ఞత తెలిపిన క్యూబా నాయకత్వం అదే సోవియట్ నాయకత్వం తప్పుధోరణుల్లోకి వెళ్లినప్పుడు తీవ్రంగా ఖండించింది. ప్రజలకు ప్రోత్సాహకాలు, బోనస్‌లు ఇచ్చి పనిచేయిం చడం సోషలిజమేనా? అని ఫిడెల్ ప్రశ్నించారు. ప్రపంచ మానవాళిపై ఇంత ప్రభావం కలి గించిన జననేత ఇటీవలి చరిత్రలో కనిపించరు. క్యూబన్లకు, లాటిన్ అమెరికన్ దేశాల ప్రజలకు, యావత్ ప్రపంచ ప్రజానీకానికి కూడా పోరాట స్ఫూర్తిని కలిగించిన విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో నేడు భౌతికంగా కనుమరుగయ్యారు. ఆశయాల పరంగా ఆయన పీడిత ప్రజల్లో చిరస్మరణీయుడై నిలిచి ఉంటారు.
డాక్టర్ ఏపీ విఠల్
వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు
మొబైల్ : 98480 69720