సన్నకారు సాగుకి పెద్ద గండం | climate changes leads increasing temperatures | Sakshi
Sakshi News home page

సన్నకారు సాగుకి పెద్ద గండం

Published Fri, May 13 2016 12:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

సన్నకారు సాగుకి పెద్ద గండం - Sakshi

సన్నకారు సాగుకి పెద్ద గండం

విశ్లేషణ
వాతావరణ మార్పుల ముప్పు ఉన్న అగ్రశ్రేణి 20 దేశాల్లో మన దేశం ఒకటి. గత నాలుగు దశాబ్దాలలో మన ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫలితంగా వరదలు, దుర్భిక్షాలు, తుపానులు ఎక్కువయ్యాయి. అధిక సంఖ్యలోని సన్నకారు రైతుల కుటుంబ ఆదాయాలు పడిపోయి పేదరికంలో  కూరుకుపోయాయి. వాతావరణ మార్పులు భూసారంపైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సన్నకారు రైతులు వ్యవసాయం చేయలేని వారుగా దిగజారిపోతూనే ఉన్నారు.

బుందేల్‌ఖండ్‌లో భారత సన్నకారు వ్యవసాయం కల కరిగిపోయింది. చంబల్‌ బందిపోట్లవల్ల, ఝాన్సీరాణి వల్ల ప్రసిద్ధిచెందిన ఈ మెట్ట ప్రాంతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ జిల్లాల్లో  విస్తరించి ఉంది. అది వాతావరణ మార్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతం. అది గత దశాబ్దిలో 2003– 2010 మధ్య, 2012–14 మధ్య దుర్భిక్షాలకు గురైంది, 2011లో వరదలకు దెబ్బతింది. ఖరీఫ్‌లో వివిధ మెట్ట పంటలను కలగలిపి వేయడం నుంచి, ఖరీఫ్‌లో శనగ, ఆవాలు వంటి వాణిజ్య పంటలను వేయడం వరకు ఆ ప్రాంత రైతులు సకల ప్రయత్నాలూ చేశారు. బోరు బావులు, ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలపైనా,  విత్తనాలు, ఎరువులపైనా వారు భారీగా మదు పులు పెట్టారు. గత రెండు శీతాకాలాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానలు పంటలను నాశనం చేశాయి (శనగ దిగుబడి దాదాపు తుడిచిపెట్టుకుపోగా, కంది పంట మొత్తంగానే పోయింది). ఇది, రైతు ఆత్మహత్యలకు (2003 నుంచి 3,500 మంది), భారీ వలసలకు దారితీసింది. పంటల బీమా సదుపాయాన్ని కల్పించడానికి బదులుగా గోదాములను నిర్మించే పనులు చేపట్టడం వల్ల  రైతులకు ఎలాంటి ఉపశమనం కలగలేదు సరికదా, కాంట్రా క్టర్లకు మేలు జరిగింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తమకు నష్టపరిహారమైనా (ఒక్కో మరణానికి రూ. 7 లక్షలు) ఇస్తుందని బాధిత కుటుంబాలు ఆశిం చాయి. పరిహారానికి బదులు గోధుమ మోపులు ఇచ్చారు. చిక్కి శల్యమైన పశువులు ఈడిగిల పడి ఉండగా... ఏ దిక్కూలేని రైతులు ఏ దేవుడైనా కరుణించకపోతాడా అని పై చూపులు చూస్తూనే ఉన్నారు.

రైతుకు ‘వాతావరణం’ కాటు
వాతావరణ మార్పులకు గురయ్యే దేశాల సూచీలో మన దేశం అగ్రశ్రేణి 20లో ఒకటి. గత నాలుగు దశాబ్దాల్లో మన భూఉపరితల ఉష్ణోగ్రతలు సగటున 0.30lసెంటీగ్రేడ్‌ మేర పెరిగాయి. ఫలితంగా వరదలు, దుర్భిక్షాలు, తుపానులు ఎక్కువయ్యాయి. దేశంలోని అధిక భూకమతాలు ఒక హెక్టారు కంటే తక్కువవి. ఆ సన్నకారు రైతుల కుటుంబ ఆదాయం తీవ్రంగా పడిపో యింది. కరవు పరిస్థితుల్లో ఆ కుటుంబాలు పేదరికంలోకి కూరుకుపో యాయి. వాతావరణ మార్పులు భూసారంపైన కూడా ప్రతికూల ప్రభా వాన్ని చూపుతాయి. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగటం కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఎక్కువగా విడుదల కావడానికి, సహజ నత్రజని లభ్యత తగ్గడానికి దారి తీస్తుంది. దీన్ని తట్టుకోవడానికి రసాయనిక ఎరువుల వాడకం పెరుగు తుంది. ఇది దీర్ఘకాలంలో భూసారాన్ని  క్షీణించిపోయేలా చేస్తుంది. మరింత భూసార క్షయానికీ, ఎడారిగా మారడానికి దారితీస్తుంది. రైతు ఆత్మ హత్యలు, గిడసబారిన గ్రామీణ ఆదాయాలు, ప్రజా ప్రయోజనాల పేరిట భూ సేకరణ జరపడం కలసి వాతావరణ మార్పుల ఉపశమనం అనే భావ ననే రాజకీయం చేసేశాయి. సన్నకారు రైతులు వ్యవసాయానికి పనికిరాని వారుగా దిగజారిపోతూనే ఉన్నారు.

మన వ్యవసాయం మరింత ఎక్కువగా వర్షాధారమైనదిగా మారి పోతూనే ఉంది. మొత్తం పంట వేసిన భూమిలో అధిక భాగంలో వర్షాధార వ్యవసాయమే సాగుతోంది. అదే మన జాతీయ ఆహార  ఉత్పత్తిలో గణనీయ మైన భాగాన్ని అందిస్తోంది (వరిలో 55%, కాయధాన్యాల్లో 90%, అన్ని తృణధాన్యాల్లో 91%). ప్రాంతీయంగా అమలులో ఉండే పంటల విధానాలు వాతావరణ పరిస్థితులలో ఒక ప్రత్యేకమైన తేడాలుంటాయనే ప్రమేయంపై  ఆధారపడి ఉంటాయి. అందువల్లనే అధిక వర్షాలు సుదీర్ఘంగా కొనసాగడం, సుదీర్ఘంగా వర్షాలు లేకపోవడం వంటి పరిస్థితులను మన పంటల విధా నాలు తట్టుకోలేకపోతున్నాయి. కోతలకు ముందటి వారంలోని అకాల వర్షాల కారణంగా 2013లో గోధుమ, శనగ, పెసర, ఆవ పంటలు భారీ ఎత్తున దెబ్బతినిపోయాయి. ప్రభుత్వం వరద రక్షణ చర్యల కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నా స్వాతంత్య్రానంతర కాలంలో మన దేశంలో వరదల తాకిడికి గురయ్యే ప్రాంతం రెట్టింపుకు పెరిగింది. 2050 నాటికి వేసవి వర్షపాతం 70% తగ్గుతుందని ఐసీఐర్‌ఐఈఆర్‌ అంచనా. ఇది,  క్షామ పీడిత గ్రామీణ భారతం ఆర్థిక దుస్థితికి, సామాజిక అన్యాయానికి సజీవ దర్ప ణంగా నిలుస్తుంది. లెక్కలేనన్ని ప్రభుత్వ పథకాలు ఈ నిరాశామయ పరిస్థితిని ఎన్నడూ నిజంగా మార్చింది లేదు.

గండం గట్టెక్కేదెలా?
2011 నాటికి ఖరీఫ్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదల (0.7నిఇ  3.3నిఇ) వల్ల వర్షపాతంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా రబీ గోధుమ 22%, వరి 15% మేరకు దిగుబడి క్షీణిస్తుండవచ్చని అంచనా. ఇక జొన్న, వేరుశనగ, శనగ దిగుబడులు తీవ్రంగా క్షీణిస్తాయి. ఫలితంగా ఆకలితో అలమటిస్తున్నవారు అత్యధికంగా ఉన్న మన దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుంది. అల్ప వ్యవసాయ ఉత్పాదకత కీలక ప్రతిబం ధకంగా ఉంటోంది. మనం హెక్టారుకు 2,929 కేజీల వరిని ఉత్పత్తి చేస్తుండగా, చైనా అంతకు రెట్టింపు ఉత్పత్తి చేస్తోంది (స్వామినాథన్‌ కమిటీ ఆన్‌ ఫార్మర్స్, 2006). ఇక ఇతర పంటల విషయంలోనూ అల్ప ఉత్పాదకత కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. గ్రామీణ వ్యయ ప్రణాళిక... వ్యవసాయరంగ మౌలిక సదుపా యాలపైన, ప్రత్యేకించి నీటిపారుదల, వర్షపు నీటి పరి రక్షణ, భూసార పరీక్షా కేంద్రాల జాతీయ స్థాయి నిర్మాణం వ్యవస్థపైన దృష్టిని కేంద్రీకరించడం అవసరం. నీటి సంరక్షణ చర్యలు (సూక్ష్మ నీటిపారుదల, వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్, బీమా కవరేజి) క్షామంలో సంభ వించగల నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించగలుగుతాయి. దుర్భిక్షాన్ని ఎదు ర్కొనే వ్యూహాలను గ్రామీణ స్థాయికి విస్తరింపజేయాలి. ఉదాహరణకు, గ్రామీణ ఉపాధి హామీ పనుల కింద ప్రతి గ్రామానికి ఒక కుంటని నిర్మింప జేయాలి.

మన వ్యవసాయ విధానం వ్యవస్థాపరంగానే సాగుబడిని వాతావరణ మార్పుల దుష్ప్రభావానికి గురయ్యేలా చేసింది. మన వ్యవసాయ సేకరణ విధానం ఉత్పాదక ప్రభావాన్ని కలిగించేదిగా ఉండాలి. నీటి లభ్యత వినియోగ సామర్థ్యం సాపేక్షికంగా ఎక్కువగా ఉన్న (వాటర్‌ ఫుట్‌ ప్రింట్‌) ఉత్తరప్రదేశ్‌లో గోధుమ సేకరణ మధ్యప్రదేశ్‌లో (సగం కంటే తక్కువ సమర్థతతో) కంటే తక్కువగా నమోదైంది. జాతీయ రైతు కమిషన్‌ తరచూ సూచిస్తున్నట్లు సంరక్షిత సాగును, మెట్ట సాగును ప్రోత్సహించాలి. ప్రతి గ్రామానికి వర్షపాతం, వాతావరణాలకు సంబంధించిన, వివిధ రుతు వులలో వచ్చే చీడపీడల గురించి ముందస్తు హెచ్చరికలను అందించాలి. జీవ వైవిధ్యపూరితమైన అడవుల పెంపకం ప్రాంతీయ స్థాయి వాతావరణ పరిస్థి తులలో మార్పుతేవడానికి, భూసారం కొట్టుకుపోవడాన్ని అరికట్టడానికి తోడ్పడుతుంది.

మన వ్యవసాయ పరిశోధన మెట్ట సాగు దిశగా, క్షామాన్ని తట్టుకునే విత్తనాల తయారీ దిశగా దృష్టిని కేంద్రీకరించేలా చేస్తే ఉత్పత్తిలో కలిగే నష్టాన్ని దాదాపు మూడింట ఒకటో వంతుకు తగ్గించవచ్చు. నాట్లు వేసే తేదీలను మార్చడం వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో బాగా తోడ్పడుతుంది. గోధుమను ముందుగా నాటడంపై చేసిన పరిశో« దనలు దాన్ని ధ్రువపరుస్తున్నాయి. అసలు దున్నకుండా ఉండటం, లేజర్‌ ఆధారంగా చదును చేయడం నీరు, భూ వనరుల పరిరక్షణకు తోడ్పడ తాయి. మెట్ట పరిస్థితులకు తగిన జన్యు రకాలను ఉపయోగించుకుని వివిధ ప్రాంతాల వాతావరణ మండలాలకు అనుగుణమైన పంటల ప్రణాళికలను రూపొందించాలి.

సన్నకారు సాగుకు కావాలి ఆసరా వాతావరణ మార్పుల బాధితులైన సన్నకారు రైతాంగానికి ఉపశమనం కలగాలంటే  వారికి బీమా, పరపతి సదుపాయాలు అవసరం. వ్యవస్థాగత పరపతిని సన్నకారు రైతులందరికీ విస్తరింపజేయాలి. రైతు కమిషన్‌ సూచించినట్టు అన్ని పంటలకు బీమాను   విస్తరించడంతోపాటూ ప్రభుత్వ మద్దతుతో వడ్డీ రేటును నామమాత్రపు స్థాయికి తగ్గించాలి. దుర్భిక్షం తాకిడికి, వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన ప్రాంతాలలో రుణ వాయిదా విధానాన్ని ప్రకటించి, సాగుబడి ఆదాయాల పునరుద్ధరణ జరిగే వరకు వడ్డీని మాఫీ చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర పంటల, పశువుల, కుటుంబ ఆరోగ్య బీమా ప్యాకేజీని ప్రారంభించాలి. వరుసగా వస్తున్న ప్రకృతి విపత్తుల నుంచి ఉపశమనాన్ని కలిగిచేందుకు గానూ వ్యవసాయ పరపతి నష్టభయ నిధిని ఏర్పాటు చేయాలి.
వాతావరణ మార్పులు మొత్తంగా ఆహార గొలుసును, ఆహార భద్రతను ప్రభావితం చేస్తాయి. పశుపోషణను సన్నకారు రైతులకు ప్రత్యా మ్నాయ ఉపాధి అని తరుచుగా పేర్కొంటారు. కానీ పంట విస్తీర్ణం తగ్గడం వల్ల మేతకు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత జనాభా పెరుగు తుండటంతో వివిధ పంటలు ఆవశ్యకమవుతున్న పరిస్థితులలో దిగుబడులు క్షీణించిపోవడం ఆందోళనకరం. ఆహార పంటలపై  పెట్టు బడులు పెట్ట డంతో పాటూ నీటిపారుదలకు, మౌలిక సదుపాయాలకు, గ్రామీణ సంస్థ లకు మద్దతును అందించాలి. అది, వాతావరణ మార్పుల ఫలితంగా సంభ వించే ఆహార అభద్రతను అధిగమించానికి, మన  ఆహార ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. వాతావరణ మార్పులను  తట్టుకునే మార్పులను తేవడం,  ఉపశమన చర్యలను చేప ట్టడం ద్వారానే మనం ఈ సవాలును ఎదుర్కొనగలం.
http://img.sakshi.net/images/cms/2015-05/81431027483_295x200.jpg
వ్యాసకర్త  కేంద్రమంత్రి మనేకా గాంధీ కుమారుడు, బీజేపీ నేత: వరుణ్‌ గాంధీ
ఈమెయిల్‌ :  fvg001@gmail.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement