పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? | opinion by CPI Narayana over JNU Student leader kannah kumar cases | Sakshi
Sakshi News home page

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా?

Published Sat, Feb 27 2016 2:10 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? - Sakshi

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా?

పిచ్చుకే కదా అని కన్హయ్యపై దాడి చేస్తే బంతి ఎదురుతిరిగినట్లు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాల యాల్లో విద్యార్థులు స్పందిస్తున్నారు. మేధావులు పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు ఉత్తరాలు రాస్తున్నారు. కాలిఫోర్నియాలాంటి యూనివర్శిటీల్లో సంఘీభావ ప్రదర్శనలు చేస్తున్నారు.
 
నిన్నటి వరకు బాలుడుగా ఉన్న జేఎన్‌యూ కన్హయ్య నేడు మహాబలాఢ్యు డిగా ఎదిగిపోయాడు. పిచ్చుకమీద బ్రహ్మా స్త్రమే తిరిగి మోదీపై తిరగబడింది. ఆ పిల్లా డిని దేశద్రోహం కేసులో ఇరికించి, దాన్ని సమర్థించుకోవడానికి తప్పుడు ఆధారాలు వెతుక్కోవడం మొదలుపెట్టారు. చివరికి రాజకీయరంగంలో, జర్నలిజం రంగంలో సకల అనైతిక చర్యలకు పాల్పడి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ప్రైవేట్ వార్తారంగాన్ని ఆశ్రయించి, సీడీలనే టాంపరింగ్ చేసి ఫిబ్రవరి 9వ తేదీ సభకు 11వ తేదీన జరిగిన సభ సీడీలను కలగాపులగం చేసి కన్హయ్యకు సంబంధంలేని నినాదాలను, కన్హయ్య నోటినుంచి వచ్చేట్టు మిక్స్ చేయించి, విడుదల చేయించారు.

 ఆజాదీ అంటే విముక్తి. పేదరికం, ఆకలి నుంచి విముక్తి, పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి విముక్తి, మనుస్మృతి నుంచి విముక్తి తదితర నినాదాలిస్తున్న కన్హయ్య హావభావాల్లో జాతి వ్యతిరేక నినాదాలను కల్పించి నీచాతి నీచ ప్రక్రియకు పాల్పడ్డారు. చివరకు ఏ టీవీ అయితే అలాంటి దుర్మార్గానికి పాల్పడిందో అందులో భాగస్వామి అయిన రిపోర్టర్ విశ్వజిత్ ఆత్మవంచన చేసుకోలేక రాజీనామా చేసి బయటకి వచ్చేశారు.

 కోర్టులలో సైతం కన్హయ్యపై దాడికి పాల్పడ్డారంటే వీరి రాజ్యాంగ ధర్మం ఏపాటిది? పోలీసు కమిషనర్ బస్సీ అక్కడే ఉండి విలేకర్ల సమావేశంలో ఎలాంటి గొడవ జరగలేదని ప్రకటిస్తున్నారు. అదే టీవీలో మరో పక్క లాయర్ యూనిఫాంలో ఉన్న సంఘ్‌పరివార్ సైన్యం దాడులు యథేచ్ఛగా చేస్తూనే ఉన్నారు.

 ఆ దాడులకు పాల్పడ్డ లాయర్లకు సమన్స్ ఇచ్చాం. వారికోసం ఎదురు చూస్తున్నామని పోలీస్ అధికారి ప్రకటిస్తారు. అనుమా నించిన వెంటనే విద్యార్థులపై దేశద్రోహ కేసు, బహిరంగంగా కోర్టులో దాడి చేసిన ఒక ఎంఎల్‌ఏకి, ముగ్గురు లాయర్లకు సన్మానాలే కాదు... సమన్స్ ఇచ్చి పోలీసుస్టేషన్‌కు పిలిపించి సకల మర్యా దలతో తేనీరందించి పంపుతారా?

 ఎన్డీఏ పాలనలో అధికార దుర్వినియోగం ఎలా అమలు పరుస్తున్నారో స్పష్టంగా కనబడుతోంది. అసలా దేశద్రోహ చట్టం బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు అమలులోకి వచ్చింది. చివరికి ఆ బ్రిటన్‌లోనే ఈ దుర్మార్గపు చట్టాన్ని రద్దు చేసింది. దేశ భక్తి గురించి చెబుతున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం దాన్నే అమలు చేస్తోంది. ఏక బాణం, ఏకపత్ని, ఏక హిందూ రాష్ట్రంగానే ఉండాలనే రహస్య ఎజెండాను ప్రవేశపెట్టడానికి యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్భయంగా ఉపయోగించుకుంటోంది. అంతెందుకు.. మోదీ, వెంకయ్య చుట్టూ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ కూడా జేఎన్‌యూ వాళ్లే. దేశాభివృద్ధికి ప్రముఖులను తయారు చేసే ఉన్నత విద్యా సంస్థల్లో అభ్యసించే భావి భారత పౌరులు

దేశద్రోహులా?
 కీలక స్థానాల్లో తమవాళ్లను నియమించుకుంటూ ఆధిపత్యాన్ని చలాయించాలనుకుంటున్న  సంఘీయులు అలాంటి తాపత్రయాన్ని విద్యార్థి లోకం నుంచి ప్రారంభించారు. ఏబీవీపీ ఎక్కడ పిటిషన్లు పెడితే అక్కడ దాన్ని ప్రామాణికంగా తీసుకుని మంత్రుల ద్వారా అమలు చేస్తున్నారు. మద్రాస్ ఐఐటీలో పెరియార్ విద్యార్థి సంఘంపై వేటు వేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాల యంలో ఏబీవీపీ ఫిర్యాదు మేరకు బండారు దత్తాత్రేయ ద్వారా స్మృతి ఇరానీ అధికారాన్ని ఉపయోగించి ఐదుగురు రిసెర్చి స్కాలర్స్‌ను సస్పెండ్ చేసి, హాస్టల్స్ నుంచి తొలగిస్తే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు. జేఎన్‌యూలో లాగా రాజకీయ చైతన్యం కలిగి ఉంటే రోహిత్ ఆ చర్యకు పాల్పడేవాడు కాదు. ఆత్మహత్య రూపంలో రోహిత్‌పై సర్కారీ హత్యకు చరమగీతం పాడాలి. అందుకే రోహిత్ ఆత్మహత్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా రోహిత్ సంఘీభావ ఉద్యమం జరుగుతోంది.
 

జేఎన్‌యూలో ఏబీవీపీ ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘ ఎన్నికలలో గెలిచిన కన్హయ్యపై దేశద్రోహం కేసుపెట్టి జైలుకు పం పారు. ఎక్కడ ఏబీవీపీకి శృంగభంగమయిందో అక్కడంతా ప్రత్య ర్థులపై కఠిన చర్యలకు పాల్పడుతున్నారు. పిచ్చుకే కదా అని కన్హయ్యపై దాడి చేస్తే బంతి ఎదురుతిరిగినట్లు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు స్పందిస్తున్నారు. వేలాదిమంది మేధావులు వ్యాసాలు ఉత్తరాలు రాస్తున్నారు. కాలిఫోర్నియాలాంటి యూనివర్శిటీల్లో సంఘీభావ ప్రదర్శనలు చేస్తున్నారు.

 మమ్మల్ని వ్యతిరేకించేవారంతా దేశద్రోహులవుతారని ముద్ర వేసి మరీ దాడులు చేస్తున్నారు. కన్హయ్యపై దేశద్రోహ ఆరోపణలను ఖండించిన నారిమన్ లాంటి న్యాయవాదులు, అమర్త్యసేన్ లాంటి ప్రఖ్యాత మేధావులు కూడా దేశద్రోహులేనా? రొమిల్లా థాపర్ వంటి చరిత్రకారులతోపాటు మాజీ న్యాయమూర్తులు కూడా వ్యతిరేకి స్తున్నారు. వీరంతా దేశద్రోహులేనా? ఇద్దరు ప్రధానులు (ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ) దేశం కోసం బలైన కుటుంబం కూడా దేశ ద్రోహ కుటుంబమేనా? దేశం కోసం సర్వం త్యాగం చేసి నిర్బంధ జైలు జీవితం అనుభవించిన కమ్యూనిస్టులు కూడా దేశద్రోహులా?
 
స్వాతంత్య్ర పోరాటంలో ఒక్క లాఠీ దెబ్బ, ఒక్క రోజు జైలుకు కూడా వెళ్లకుండా బ్రిటిష్ రాణికి స్వాగతం పలికిన సంఘ్‌పరివారీ యులు దేశభక్తులా? కశ్మీరులో అఫ్జల్‌గురు ఫొటోలు పెట్టి పూజిస్తూ అతడి మరణాన్ని కీర్తిస్తున్న పీడీఎఫ్‌తో కలిసి కాపురం చేసే వారు దేశ భక్తులా? ఒకప్పుడు ముస్లింలనే దేశద్రోహులనేవారు. ఇప్పుడు హిందువులైన రోహిత్, కన్హయ్య, అపరాజిత వంటి వారిని దేశద్రోహు లంటున్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ అనుకూల విధానాలతో భారత్‌లో ఉండాలి విభేదించేవారు దేశం వదిలి వెళ్లండి లేదా చావండి’ అనే నినాదంతో పాలించే మీకు భిన్నత్వంలో ఏకత్వం సాధించిన భారత సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
 కన్హయ్యపై దేశద్రోహం కేసును వ్యతిరేకిస్తూ దాదాపు పదివేల మంది జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్శిటీతోపాటు అన్ని కళాశాలల నుంచి యువతీయువకులు, ఉపాధ్యాయరంగమంతా రంగంలోకి దిగింది. ఇంత నిరసన జరుగుతున్నా ఎన్జీయే ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పుమీద తప్పు చేస్తూ పార్లమెం టులో సైతం మొండిగా, కరుగ్గా ఘీంకరిస్తోంది. దీన్ని ఛేదించాలంటే కిందిస్థాయి నుంచి ఢిల్లీ వరకు వామపక్ష, సెక్యులర్ భావాలు కలిగిన అన్ని శక్తులను కూడగట్టుకోవలిసి ఉంది. అబద్ధాలతో రాజ్యమేలు తున్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది.
 

(వ్యాసకర్త : నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి మొబైల్: 94909 52222)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement