సాక్షి, యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి గర్భాలయం పనులు వేగం పుంజుకున్నాయి. సీఎం కేసీఆర్ నవంబర్ 24న యాదాద్రికి వచ్చి పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పనులను వేగవంతం చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. మార్చి 31లోగా గర్భాలయంపై స్లాబు వేయడానికి ముందుగా వైటీడీఏ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అయితే పనుల విభజన చేసుకుని ముందుగా ప్రధానాలయం, గర్భాలయం పనులను పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా గర్భాలయం పైకప్పు వేయడానికి అవసరమైన కాంక్రీటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
గర్భాలయానికి ఈనెలాఖరులోగా పైకప్పు వేసే విధంగా పనులు జరుగుతున్నాయి. గర్భాలయం పైకప్పు తర్వాత ప్రధానాలయం పైకప్పు వేయనున్నారు. ఆదిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. పడమర వైపు ఏడంతస్తుల ప్రధాన రాజగోపు రం, తూర్పు, ఉత్తరం వైపు ఐదంతస్తుల రాజగోపురాల పనులు చేపట్టారు. సివిల్ పనులతోపాటు శిల్పి పనులను ప్రధానాలయంలో చేస్తున్నారు. ఆళ్వార్ పిల్లర్లు, కాకతీయ శిల్పాల పనులు జరుగుతున్నాయి. నాలుగు మాడ వీధుల్లో దక్షిణభాగంలో రిటైనింగ్ వాల్ పనుల్లో జాప్యం యథావిథిగా కొనసాగుతుంది. ఇందుకోసం ఆయా విభాగాలకు చెందిన అధికారులు, స్తపతులు నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. విష్ణు పుష్కరిణి, లడ్డూ ప్రసాదం, మండప కాంప్లెక్స్‌లు, శివాలయం, ఇతర పనులను వేగవంతం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment